కరోనాతో భారత్ సర్వనాశమైంది: డొనాల్డ్‌ ట్రంప్‌

Donald Trump: India Has Just Been Devastated By COVID19 - Sakshi

వాషింగ్టన్‌: కోవిడ్‌ మహమ్మారితో భారత్‌ సర్వనాశనమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్‌లో కరోనా వైరస్ పరిస్థితుల గురించి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి. ప్రజారోగ్యం విషయంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్‌ను ఉదాహరణగా ట్రంప్ పేర్కొన్నారు‌. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌కు చైనాయే కారణమని మరోసారి ట్రంప్‌ విరుచుకుపడ్డారు. వైరస్‌ వ్యాప్తికి బాద్యత వహిస్తున్న చైనా అమెరికాకు 10 ట్రిలియన్‌ డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. వాస్తవానికి ప్రపంచానికి చైనా ఇంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని, కానీ దాని సామర్థ్యం ఇంతేనని అన్నారు. అయితే అమెరికాకు చెల్లించాల్సింది చాలా ఉంది. చైనా చేసిన చర్యల వల్ల అనేక దేశాలు నాశనమయ్యాయని ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు లేదా అసమర్థత వల్ల జరిగిందని భావిస్తున్నానన్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగినా.. ఎలా జరిగినా చాలా దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు. వారు ఎప్పటికీ కోలుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు.  మన దేశం(అమెరికా) చాలా తీవ్రంగా నష్టపోయింది. కానీ ఇతర దేశాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.  భారత్‌నే తీసుకుంటే ఆ దేశంలో ఎన్నడూలేని విధంగా ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

‘ఇప్పుడు భారత్‌లో ఏం జరుగుతుందో చూడండి. భారతదేశం ఎంతగా శ్రమిస్తోందో చూడండి. భారతీయులు ఎప్పుడూ బయటపడటం కోసం చూస్తున్నారు. భారత్ ఇప్పుడిప్పుడే సర్వనాశనం అయ్యింది.. వాస్తవంగా ప్రతి దేశం కూడా తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఇది ఎక్కడ నుంచి, ఎలా వచ్చింది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఈ విషయం నాకు తెలుసని నేను అనుకుంటున్నాను.  అయితే చైనా ఇందుకు సాయం చేయాలి. అప్పుడే భారతీయ ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి’’ అని ట్రంప్‌ అన్నారు.

కరోనా వైరస్ తొలిసారిగా 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది వుహాన్ ల్యాబ్ నుంచే లీకయ్యిందని ట్రంప్ మరోసారిఆరోపించారు. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా 17.75 కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. 38.35 లక్షల మంది మరణించారు. ఏప్రిల్‌ నుంచి భారత్‌లో రెండో దశవ్యాప్తి కొనసాగుతోంది. ఆక్సిజన్‌, బెడ్స్‌ కొరత సమస్యను ఎదుర్కొన్న భారత్‌  ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతుంది.

చదవండి:‘హలో.. హిల్లరీ క్లింటన్‌ను ఉరి తీశారా?’
FaceBook : జుకర్‌బర్గ్‌కి ఎసరు పెట్టిన ట్రంప్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top