అమెరికా సుప్రీం జడ్జిగా జస్టిస్‌ అమీ | Sakshi
Sakshi News home page

అమెరికా సుప్రీం జడ్జిగా జస్టిస్‌ అమీ

Published Mon, Sep 28 2020 4:39 AM

అమీ కోనే బారెట్‌ - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అమీ కోనే బారెట్‌ను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు. న్యాయవ్యవస్థలో రిపబ్లికన్ల హవా పెంచుకోవడం కోసం ట్రంప్‌ శనివారం ఆమెను నామినేట్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. జస్టిస్‌ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌ మరణంతో ఏర్పడిన ఖాళీని ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ చేసిన అభ్యర్థనను ట్రంప్‌ పట్టించుకోలేదు. 48 ఏళ్ల వయసున్న బారెట్‌ పూర్తిగా సంప్రదాయ భావాలు కలిగిన మహిళ. సుప్రీం న్యాయమూర్తిగా నామినేషన్‌ తనకు దక్కిన అత్యంత గౌరవమని బారెట్‌ అన్నారు.

సెనేట్‌ ఆమోదం తర్వాత గిన్స్‌బర్గ్‌ స్థానంలో ఆమె నియామకం ఖరారు అవుతుంది. ట్రంప్‌ బారెట్‌ను అత్యంత మేధావి, సత్ప్రవర్తన కలిగిన మహిళగా అభివర్ణించారు. స్వేచ్ఛాయుత భావాలు కలిగిన గిన్స్‌బర్గ్‌ స్థానంలో అందుకు పూర్తిగా విరుద్ధమైన భావజాలం కలిగిన మహిళను ట్రంప్‌ నామినేట్‌ చేశారు. అధ్యక్ష ఎన్నికలకి కొద్ది వారాలే గడువుండగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నామినేషన్‌ను తీసుకున్న ట్రంప్‌ సుప్రీం కోర్టులో కూడా రిపబ్లికన్ల సంప్రదాయ ముద్ర వేయాలని చూస్తున్నారు.  

అధ్యక్ష ఎన్నికలయ్యే వరకు ఆమోదించొద్దు: బైడెన్‌
సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో కూడా పట్టు బిగించడానికి ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తున్నారని జో బైడెన్‌ విమర్శించారు. అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యేవరకు అమీ నామినేషన్‌ను ఖరారు చేయవద్దని ఆయన సెనేట్‌కు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement