World Emoji Day: ఎమోజీల ఎక్స్‌ప్రెషన్స్‌కి అర్థాలే వేరులే!

Did You Know Real Meaning Of These Emojis On World Emoji Day 2021 - Sakshi

కొంచెం బాధ, మరికొంచెం జాలి, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, అమితమైన ప్రేమ..ఇలా ఏ భావాన్ని అయినా, ఎంత భారీ భావోద్వేగాన్ని అయినా సింపుల్‌గా వ్యక్తపరచడానికి ఎమోజీలును ఉపయోగిస్తుంటాం. అలాంటి ఎమోజీలకు గుర్తింపు దక్కిన రోజు ఇది. ఇవాళ (జులై 17)న వరల్డ్‌ ఎమోజీ డే. 

స్మార్ట్‌ ఫోన్‌లలో ఎన్ని అప్‌డేట్‌లు వస్తున్నా, మెసేజింగ్‌ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటాయి. అవతలి వాళ్లు చాంతాడంత మెసేజ్‌ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా ఏంటో తెలుస్తుంది. చాలామందికి ఇవి పనుల్ని తేలిక చేస్తుంటాయి, కొందరికి సరదా పంచుతుంటాయి.


ఇక మంచం మీద నుంచి లేవడం దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా, కాలకృత్యాల నుంచి ప్రతీ పనికి ఏదో సింబల్‌తో ఎమోజీలు కనిపిస్తూనే ఉంటాయి. కొత్తగా అప్‌డేట్స్‌లతో వస్తుంటాయి. అయితే పసుపు రంగులో ఉండే ఈ గుర్తుల్లో కొన్నింటిని కొందరు పొరపాటుగా అర్థం చేసుకుంటుంటారు. ఉదాహరణకు.. క్లాప్స్‌ సింబల్‌ను  కొందరు దణ్ణం సింబల్‌గా పొరబడుతుంటారు. అలాగే కొన్ని ఎమోజీలకు అర్థాలు వేరుగా కూడా ఉన్నాయి. 

స్మైలింగ్‌ ఫేస్‌ విత్‌ హార్ట్స్‌   
ముఖంలో సిగ్గు.. సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్లు.. చుట్టూ హార్ట్‌ సింబల్స్‌. చాలామంది దీనిని సిగ్గుకి, సంతోషానికి, అవతలివాళ్లపై ఆప్యాయతను వ్యక్తపర్చడానికి ఉపయోగిస్తుంటారు. ఎవరికి పడితే వాళ్లకు పంపిస్తుంటారు. కానీ, ఆ ఎమోజీ అసలు ఉద్దేశం తాను పీకలలోతులో ప్రేమలో మునిగిపోయానని అవతలి వాళ్లకు తెలియజెప్పడం.

డ్యాన్సింగ్‌ ట్విన్స్‌ విత్‌ హార్న్స్‌
ఇద్దరు అమ్మాయిలు నెత్తిన కొమ్ముల మాదిరి(కుందేలు చెవులు) వాటితో డ్యాన్స్‌ చేసే ఎమోజీ. చాలామంది అమ్మాయిలు గ్రూపులలో ఈ ఎమోజీలను ఎక్కువగా వాడుతుంటారు. ఎగ్జయిట్‌మెంట్‌కు దీన్నొక ప్రతీకగా దానిని భావిస్తుంటారు. కానీ, దాని అసలు అర్థం అది కాదు. నెత్తి మీద అలా కుందేలు చెవులు, కొమ్ములు ఉండే ఆ ఎమోజీని ‘సెక్స్‌ అప్పీల్‌’ కోసం పెట్టారు. అంతేకాదు అడల్ట్‌ సినిమాల్లోనూ ఇలాంటి గెటప్‌లను అవతలివాళ్లను రెచ్చగొట్టే చేష్టల కోసం ఉపయోగిస్తుంటారు. ఇక జపాన్‌ కాన్సెప్ట్‌లో ఫిక్షన్‌ క్యారెక్టర్లకు సంబంధించి గెటప్‌లను వేసినప్పుడు ‘కాస్‌ప్లే’ పేరిట ఈ సింబల్‌ను ఉపయోగిస్తారు. 

ప్లీడింగ్‌ ఫేస్‌
ఈ ఎమోజీకి ఏడుపుగొట్టు ఎమోజీ అనే పేరుంది. కానీ, దీన్ని పప్పీ డాగ్‌ ఐస్‌ అంటారు. ‘వేడుకోలు’ కిందకు వస్తుంది ఇది. అయితే ‘టచ్‌ చేశావ్‌’ అనే భావాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేసేందుకు ఈ ఎమోజీని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. 

షూటింగ్‌స్టార్‌
మ్యాజిక్‌ ఎమోజీ అని కూడా పిలుచుకుంటారు. ఎక్కువ ఉత్సాహంలో, ఉద్రేకంలో ఉన్నప్పుడు ఈ ఎమోజీని ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇది మైకాన్ని ఉద్దేశించి రూపొందించిన ఎమోజీ. 

ది పూప్‌ ఎమోజీ
సింబల్‌ చూస్తేనే ఇదేంటో అందరికీ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్‌ మధ్య సరదా సంభాషణల్లో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. కానీ, దీని అర్థం ‘అదృష్టం’ అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కావాలంటే ఎమోజీ డిక్షనరీ ఓపెన్‌ చేసి చూడడండి.

ఎమోజీలు ఎప్పటికీ ఫేడ్‌ అవుట్‌ కావు. ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి, పైన చెప్పిన ఎమోజీలను నెక్స్ట్‌ ఎప్పుడైనా ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. అన్నట్లు లండన్‌కు చెందిన ఎమోజీపీడియా ఫౌండర్‌ జెర్మీ బర్గ్‌(37).. 2014 జులై 17న వరల్డ్‌ ఎమోజీ డేను మొదలుపెట్టాడు. అంతేకాదు ఈరోజున ఎమోజీలను ఎక్కువగా ఉపయోగించడంటూ ఓ పిలుపు కూడా ఇచ్చాడు. ఇక ఈ ఏడాది రిలీజ్‌ అయిన కొత్త ఎమోజీలలో.. గర్భంతో ఉన్న మగవాళ్ల ఎమోజీ విమర్శలతో పాటు విపరీతమైన చర్చకూ దారితీస్తోంది. 

Election 2024

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top