
డెన్మార్క్ తపాల శాఖ ‘పోస్ట్‌నార్డ్’ వెల్లడి
కోపెన్‌హాగెన్: డెన్మార్క్‌లో ఉత్తరాల బట్వాడాను ఈ ఏడాది చివరికల్లా నిలిపివేయనున్నట్లు డెన్మార్క్, స్వీడన్‌ల ప్రభుత్వ తపాలా సేవల విభాగం ‘పోస్ట్‌నార్డ్’ప్రకటించింది. పార్సిల్ సేవలను మాత్రం యథా ప్రకారం కొనసాగిస్తామని తెలిపింది. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో డెన్మార్క్ వ్యాప్తంగా ఉన్న 1,500 తపాలా బాక్సులను తొలగిస్తామంది. తాజా పరిణామంతో పోస్ట్‌నార్డ్‌లోని 4,600 మంది ఉద్యోగులకు గాను 1,500 మంది తొలగింపునకు గురి కానున్నారు.
స్వీడన్‌లో మాత్రం ఉత్తరాల బట్వాడాపై ఎటువంటి ప్రభావం ఉండదని పోస్ట్‌నార్డ్ వివరించింది. 2000వ సంవత్సరంతో పోలిస్తే ఉత్తరాల సంఖ్య 90 శాతం మేర పడిపోయిందని, ఇందులో 30 శాతం వరకు ఒక్క 2024లోనే ఉందని తెలిపింది. డెన్మార్క్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా డిజిటల్ మాధ్యమాల వైపు మళ్లడమే ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. 2024లో పోస్టల్ ఫీజులను భారీగా పెంచడం ఇందుకు తోడైంది. డెన్మార్క్ పోస్టల్ విభాగానికి 400 ఏళ్ల ఘన చరిత్ర ఉందని పోస్ట్‌నార్డ్ డెన్మార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిమ్ పెడెర్సన్ చెప్పారు.
ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలోనే ఉత్తరాలు వస్తున్నందున, ఏమంత లాభదాయంగా లేదన్నారు. తమకు ఇప్పుడు ప్రధాన వనరు పార్సిల్ డెలివరీయేనన్నారు. ప్రజలు తమ ఉత్తరాలను పార్సిల్‌ల ద్వారా కూడా పంపుకోవచ్చని చెప్పారు. 2026 నుంచి ప్యాకేజీ విభాగంపైనే ప్రధానంగా దృష్టిపెడతామని చెప్పారు. సుదూర ప్రాంతాల్లోని వారికి ఉత్తరాలే తప్ప వేరే సమాచార మార్గం లేనందున పోస్ట్‌నార్డ్ నిర్ణయం సరికాదని డెన్మార్క్ ఎంపీ డ్రాగ్‌స్టెడ్ చెప్పారు. అయితే, ప్రైవేటు కంపెనీలు ఉన్నందున ఉత్తరాలను పంపించుకోవడం కష్టం కాదని మీడియా అంటోంది. సుదూరంగా ఉండే దీవుల్లోని వారికి, మారుమూల ప్రాంతాల్లోకి ఉత్తరాల బట్వాడాకు అంతరాయం కలగకుండా డెన్మార్క్ ప్రభుత్వం సంబంధిత మౌలిక వసతులను కొనసాగించనుంది. కాగా, జర్మనీ ప్రభుత్వ డచ్‌పోస్ట్ సైతం తపాలా సరీ్వసులను కుదిస్తూ 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment