కరోనా లీక్‌ కాలేదనడం తొందరపాటే: టెడ్రోస్‌

Covid 19: WHO Chief Says Ruling Out Lab Leakage Was Premature - Sakshi

బెర్లిన్‌: ప్రాణాంతక కోవిడ్‌–19 విషయంలో ఇన్నాళ్లూ చైనాకు వెనకేసుకొచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అడనోమ్‌ ఘెబ్రయెసుస్‌ ఇప్పుడు భిన్నంగా స్పందించారు. కరోనా మహమ్మారికి, ల్యాబ్‌ నుంచి లీక్‌ కావడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని ఎవరైనా కొట్టిపారేస్తే అది తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. కరోనా ఎక్కడ పుట్టిందన్న అంశంపై పరిశోధన సాగుతోందని చెప్పారు. కరోనా వైరస్‌ పుట్టుకను తేల్చే విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలని చైనా ప్రభుత్వానికి హితవు పలికారు.

కరోనా పుట్టిన తొలినాళ్ల నాటి సమాచారాన్ని తాము కోరుతున్నామని చెప్పారు. చైనాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌ అయినట్లు ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్ముతున్నారని గుర్తుచేశారు. ‘‘నేను ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేశా. ల్యాబ్‌లో సేవలందించా. స్వయంగా ఇమ్యునాలజిస్టును కూడా. ల్యాబ్‌ల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటివి సాధారణమే’’ అని టెడ్రోస్‌ పేర్కొన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభం దశలో ప్రపంచం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top