యూకేలో నిబంధనల సడలింపు

Covid-19: Lockdown Relaxation in London - Sakshi

లండన్‌: లాక్‌డౌన్‌ నిబంధనలను యూకే స్వల్పంగా సడలించింది. సోమవారం నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతిం చింది. అయితే, ఆరుగురికి లేదా రెండు కుటుంబాలకు మించరాదని సూచించింది. బాస్కెట్‌బాల్, గోల్ఫ్, టెన్నిస్, స్విమ్మింగ్‌ వంటి ఔట్‌డోర్‌ క్రీడలకు కూడా అనుమతించింది. ప్రభుత్వం  ఇప్పటివరకు 3 కోట్ల మందికి, అంటే దేశ వయోజనుల్లో దాదాపు 56% మందికి తొలి డోసు కరోనా టీకాను ఇచ్చింది. ఈ జూలై నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి తొలి డోసు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆస్ట్రాజెనెకా, బయోఎన్‌టెక్‌(ఫైజర్‌) టీకాలకు తోడు ఏప్రిల్‌లో అమెరికాకు చెందిన మోడెర్నా టీకా సైతం అందుబాటులోకి వస్తుందని బ్రిటన్‌ మంత్రి ఒలివర్‌ డౌడెన్‌ వెల్లడించారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని యూకే పోలీసులు పౌరులను హెచ్చరించారు.

పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యే కార్యక్రమాలకు అనుమతి లేదని, వాటిని నిర్వహించడం, వాటిలో పాల్గొనడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తీవ్రంగా పడిన యూరోప్‌ దేశాల్లో యూకే ఒకటి అన్న విషయం తెలిసిందే. అక్కడ 1.26 లక్షల మందికి పైగా కోవిడ్‌ 19తో మృతి చెందారు. యూరోప్‌లోనే ఇది అత్యధికం. లాక్‌డౌన్‌ ఆంక్షలను స్వల్పంగా సడలిస్తున్నప్పటికీ.. పౌరులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.  ఆంక్షల సడలింపునకు అర్థం కరోనా ముప్పు తొలగిపోయిందని కాదని వివరిస్తోంది. సాధ్యమైనంత వరకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ను కొనసాగించాలని సూచిస్తోంది. స్కాట్‌లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌ల్లోనూ నిబంధనలను స్వల్పంగా సడలించారు. ప్రయాణ నిబంధనలను సడలించడంతో వేల్స్‌లో బీచ్‌లకు పౌరులు పోటెత్తారు. ఇంగ్లండ్‌లో పబ్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, సినిమా హాళ్లు తదితర అత్యవసరం కాని, ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే అవకాశమున్న వ్యాపారాలకు ఇంకా అనుమతించలేదు. యూకే ప్రభుత్వ రోడ్‌ మ్యాప్‌ ప్రకారం జూన్‌ 21వ తేదీ నాటికి పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top