చైనా అమ్ముల పొదిలో అత్యాధునిక నౌక | China most advanced aircraft carrier The Fujian enters service | Sakshi
Sakshi News home page

చైనా అమ్ముల పొదిలో అత్యాధునిక నౌక

Nov 8 2025 5:08 AM | Updated on Nov 8 2025 5:08 AM

China most advanced aircraft carrier The Fujian enters service

నేవీ చేతికి ఫుజియాన్‌ విమాన వాహన నౌక 

ప్రపంచంలో ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ వ్యవస్థ ఉన్న రెండో నౌకగా గుర్తింపు 

ఇప్పటివరకు అమెరికా యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌కు మాత్రమే ఈ సామర్థ్యం 

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సమక్షంలో ఫుజియాన్‌ కమిషనింగ్‌

బీజింగ్‌: వాణిజ్యంలోనూ, సైనిక శక్తిలోనూ అమెరికాను ఢీకొడుతున్న చైనా.. తన నౌకాదళాన్ని మరింత శక్తిమంతం చేసే చర్యల్లో మరో ముందడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫుజియాన్‌ విమాన వాహక నౌకను నౌకాదళానికి అందించింది. ఇందులో అత్యంత ఆధునికమైన ఎలక్టోమ్య్రాగ్నటిక్‌ వ్యవస్థ (ఈమల్స్‌)ను అమర్చారు. ఈ వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌లో మాత్రమే ఉంది. 

ఇటీవల హైనాన్‌ ప్రావిన్స్‌లోని సన్యా పోర్టులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్వయంగా ఈ నౌకను నౌకాదళానికి అందించినట్టు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ జిన్‌హువా పేర్కొంది. అయితే, ఈ నౌకలో ఇంకా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడారన్న విషయాన్ని చైనా అత్యంత గోప్యంగా ఉంచుతోంది. అయితే, ఆ దేశ మీడియా రిపోర్టుల ప్రకారం ఈ నౌకపై జే–15టీ, జే–35, కాంగ్‌జింగ్‌–600 వంటి యుద్ధ విమానాలను మోహరించనున్నట్టు తెలిసింది. నౌకపై ఈ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ టెస్టులు పూర్తయ్యాకే కమిషనింగ్‌ చేశారని జిన్‌హువా పేర్కొంది. ఈ నౌక బరువు 80 వేల టన్నులు.  

ఎమిటీ ఈమల్స్‌? 
విమాన వాహక నౌక పైనుంచి యుద్ధ విమానాలు రాకపోకలు సాగించటమే అత్యంత కీలకమైన అంశం. చాలా తక్కువ నిడివి ఉండే రన్‌వే పై టేకాఫ్‌ కావటం, ల్యాండింగ్‌ చేయటం క్లిష్టమైన పని. సంప్రదాయ విమానవాహక నౌకలో ల్యాండింగ్, టేకాఫ్‌ సమయంలో విమానాన్ని బయటి నుంచి నియంత్రించేందుకు టర్బైన్‌ టెక్నాలజీని వాడుతారు. గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్, ఫుజియాన్‌లో ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ టెక్నాలజీని వాడారు. 

ఈ వ్యవస్థ ద్వారా యుద్ధ విమానం తక్కువ సమయంలో ఎక్కువ శక్తి పుంజుకుని గాల్లోకి ఎగిరేందుకు బయటి నుంచి శక్తిని అందిస్తారు. ల్యాంగింగ్‌ సమయంలోనూ విమానం నిర్దేశిత ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లి సముద్రంలో పడిపోకుండా ఈ అయస్కాంత శక్తి నియంత్రిస్తుంది. సంప్రదాయ టెక్నాలజీలతో పోల్చితే  ఎలక్టోమ్య్రాగ్నటిక్‌ వ్యవస్థ సాంకేతికంగా క్లిష్టమైనదే అయినప్పటికీ.. దాని నిర్వహణ సులభం. అయితే, ఏవైనా సమస్యలు వస్తే మాత్రం రిపేర్లకు చాలా ఖర్చవుతుంది.  

అమెరికాను మించి చైనా నౌకాశక్తి 
ప్రపంచంలో అత్యంత భారీ నౌకాదళం ఉన్న దేశంగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా అవతరించింది. అమెరికా వద్ద ప్రస్తుతం 219 యుద్ధ విమానాలు ఉండగా, చైనా వద్ద 234 ఉన్నాయి. చైనా వద్ద ఇప్పటికే ఉన్న మూడు విమాన వాహక నౌకలు సంప్రదాయ ఇంధన శక్తితో పనిచేస్తాయి. దీంతో ఆ దేశం కొత్తగా అణుశక్తితో నడిచే దలియాన్‌ అనే నాలుగో విమాన వాహక నౌకను నిర్మిస్తోంది. భారత్‌ వద్ద ఐఎస్‌ఎస్‌ విక్రాంత్, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య అనే రెండు విమాన వాహక నౌకలు ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణ చైనా సముద్రంతోపాటు సుదూర సముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకొనేందుకు చైనా నౌకా శక్తిని భారీగా పెంచుతోందని చైనా మిలిటరీ వ్యవహారాల నిపుణుడు ఝాంగ్‌ జున్‌షే ఆ దేశ వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌తో తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement