అరుదైన రికార్డ్‌: అమెరికా సరసన చేరిన చైనా

China Lands Zhurong Rover on Mars - Sakshi

మార్స్‌పై విజయవంతంగా రోవర్‌ని ల్యాండ్‌ చేసిన చైనా

బీజింగ్‌: అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో చైనా దూసుకుపోతుంది. ఇప్పటికే ఛాంగీ–5 శోధక నౌక ద్వారా చంద్రుడి నమూనాలు భూమీ మీదకు తీసుకువచ్చిన డ్రాగన్‌ దేశం..  వచ్చే ఏడాదికల్లా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు ప్రయత్నించడమే కాక వచ్చే నెలలో ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసందే. 

ఈ క్రమంలో తాజాగా చైనా మరో అరుదైన రికార్డు సృష్టించి అగ్రరాజ్యం అమెరికా సరసన చేరింది. అంగారక గ్రహంపై చైనా రోవర్‌ ఝురొంగ్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయినట్లు ఆ దేశ అదికారిక మీడియా ప్రకటించింది. అమెరికా తర్వాత... మార్స్‌పై రోవర్‌ని దించిన రెండో దేశంగా చైనా నిలిచింది.  ఈ మేరకు చైనా అధికారిక మీడియా శనివారం ఉదయం (నేడు).. మార్స్‌ మీద ఉన్న సున్నితమైన వాతావరణంలో... ఓ విశాల మైదానంలో... రోవర్‌ను సురక్షితంగా దింపినట్లు వెల్లడించింది. ఇక నాసా లాగే... చైనా కూడా... మార్స్‌పై మట్టి ఎలా ఉంది, అందులో ఏ ఖనిజాలు ఉన్నాయి... అక్కడి కొండలు, గుట్టలు అన్నింటినీ అత్యంత దగ్గర నుంచి రోవర్ ద్వారా పరిశీలించగలదు.

చైనా మార్స్ మిషన్ ఇది..
గత జులైలో చైనా... తియాన్వెన్-1మిషన్‌ను మార్స్ మీదకు పంపింది. అందులో ఓ ఆర్బిటర్, ఓ ల్యాండర్, ఓ రోవర్ ఉన్నాయి. ఫిబ్రవరి 10న ఈ మిషన్... మార్స్ వాతావరణంలోకి చేరింది. ఆ తర్వాత గుండ్రంగా తిరుగుతూ ల్యాండింగ్‌ క్షణాల కోసం ఎదురుచూసింది. రోవర్ పేరు ఝురోంగ్. చైనా జనపదాల్లో అగ్నిని ఝురోంగ్ అనేవారు. అదే పేరును దానికి పెట్టింది. ఈ ఝురోంగ్ రోవర్... 240 కేజీల బరువు ఉంది. ఇది సోలార్ పవర్ ఉపయోగించుకొని మార్స్‌పై తిరగగలదు. దీనికి కెమెరాలు, రాడార్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్, వెదర్ స్టేషన్ వంటివి ఉన్నాయి.

1976 నుంచి ఇప్పటి వరకు అమెరికా అంగారక గ్రహంపై తొమ్మిది సార్లు రోవర్లును విజయవంతంగా ల్యాండ్‌ చేసింది. 1971 లో సోవియట్ యూనియన్ అంగారక గ్రహం మీద అడుగుపెట్టింది. అయితే ల్యాండ్‌ అయిన తరువాత సమాచారం పంపడంలో విఫలమవడంతో ఈ మిషన్‌ ఫెయిల్‌ అయినట్లు ప్రకటించారు. 

చదవండి: అంగారక గ్రహంపై ఆక్సిజన్‌...!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top