కరోనా పుట్టుక విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. అయితే వుహాన్ ల్యాబ్‌లోనే వైరస్ పుట్టిందన్న దానికి తగిన ఆధారాలు మాత్రం చూపెట్టలేకపోయింది. ఈ తరుణంలో ఇప్పుడు మరో అంశంపైనా డ్రాగన్ కంట్రీ గోప్యత ప్రదర్శిస్తోందని.. ఆ గుట్టు ఇప్పుడు రట్టయ్యిందని డాటాను రిలీజ్ చేసింది.
2022 మార్చి 21న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ విమానం (MU5735) గ్వాంగ్సీ ప్రాంతంలోని పర్వతాల్లో కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 132 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. విమానం 49 వేల ముక్కలు కావడంతో.. వాటి సేకరణకు భారీ సిబ్బందిని వినియోగించారు. చైనాలో గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఇది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను చైనా ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి వెల్లడించలేదు.
ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత.. అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఒక సంచలన నివేదిక ఇచ్చింది. ఆ ప్రమాదం సహజసిద్ధంగా జరగలేదని.. కాక్‌పిట్‌లో ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరా నిలిపివేశారని తెలిపింది.

ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్‌బాక్స్) విశ్లేషణలో.. 29,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు రెండు ఇంజిన్లకు ఇంధన స్విచ్‌లు ఒకేసారి “రన్” స్థితి నుండి “కట్‌ఆఫ్” స్థితికి మార్చబడ్డాయి. దీని తర్వాత ఇంజిన్ వేగం తగ్గి, విమానం వేగంగా కిందికి పడిపోయింది. ఒకవేళ అది పొరపాటుగా జరిగి ఉంటే.. పైలట్లు అప్రమత్తం అయ్యేవాళ్లు. వెంటనే తప్పును సరి చేసుకునేవారు. కానీ, అలాంటి ప్రయత్నం జరగలేదు అని డేవిడ్ సౌసీ అనే నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) బ్యాటరీ బ్యాకప్‌తో చివరి క్షణాలను రికార్డు చేసినప్పటికీ.. ఆ ఆడియో ఫైళ్లను అమెరికా అధికారులు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (CAAC)కి పంపారు. అయితే, సీఏఏసీ ఇప్పటిదాకా ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకమని అంగీకరించలేదు. 2024లో రిలీజ్ చేసిన నివేదికలో మాత్రం అంతా సవ్యంగానే ఉందని పేర్కొంది. గతంలో..

2022లో వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక కూడా ‘‘విమానం కాక్‌పిట్‌లో ఎవరో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూలిపోయింది’’ అని సంచలనాత్మక కథనం ఇచ్చింది. ఇది పైలట్ ఆత్మహత్య చర్యనా? లేదంటే మరెవరైనా కాక్‌పిట్‌లోకి చొరబడి చేసిన చర్యా? అన్న ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. అసలు బ్లాక్‌బాక్స్ డేటాను చైనా ఎందుకు బయటపెట్టడం లేదన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.


