Memory Loss Causes: జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. చాలాసేపు ప్రయత్నిస్తేనేగానీ ఏదీ గుర్తుకురాదు. మరి కారణం? 

Causes of Memory Loss In Telugu - Sakshi

మనుషులను నడిపించేదే జ్ఞాపకం. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. వృద్ధాప్యం వచ్చే సరికి ఏదైనా గుర్తు చేసుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది. చాలాసేపు ప్రయత్నిస్తేనేగానీ ఏదీ గుర్తుకురాదు. మరి దీనికి కారణం మన మెదడులో మెమరీ ఫుల్‌ అయిపోవడమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

బాల్యం, యవ్వనం.. ఓ ట్రెజర్‌హంట్‌ 
సాధారణంగా ఒక వయసు దాటగానే ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటినవారు ఏదైనా గుర్తు చేసుకోవడానికి కష్టపడుతుంటారు. మిగతా విషయాల్లో చురుగ్గా ఉన్నవారు కూడా ఈ విషయంలో ఇబ్బందిపడుతుంటారు. ఇదేమిటన్న దానిపై హార్వర్డ్, కొలంబియా, టొరంటో యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. వివిధ దశల్లో మనిషి మెదడు తీరును పరిశీలించారు. బాల్యంలో ప్రతీది కొత్తగా, అద్భుతంగా తోస్తుందని. అనుభవంలోకొచ్చే ప్రతి విషయాన్ని ఆస్వాదించే సమయమని.. ఆ దశలోని ప్రతి జ్ఞాపకం ఇట్టే గుర్తుండిపోతుందని వారు చెప్తున్నారు. యవ్వనంలో అనుభవాలు, అనుభూతులు కూడా మెదడులో నిక్షిప్తమైపోతాయని.. అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఈ జ్ఞాపకాల దొంతరలు పెరిగిపోతాయని వివరిస్తున్నారు. 

వృద్ధాప్యంలో ఎందుకు? 
చాలా మందిలో ఒక వయసు దాటిపోయాక మెదడు శక్తి ఏమాత్రం తగ్గిపోకున్నా.. జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం మాత్రం ఇబ్బందికరంగా మారుతుంటుంది. బాల్యం నుంచీ పేరుకుపోయిన జ్ఞాపకాల దొంతరలే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. వేలకొద్దీ జ్ఞాపకాల్లోంచి మనం అనుకున్న విషయాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకునేప్పుడు.. సదరు జ్ఞాపకాలతోపాటు, దానికి సంబంధమున్నవి కొన్ని, ఏమాత్రం సంబంధం లేనివి మరికొన్ని జ్ఞాపకాలు కూడా బయటికి (రిట్రీవ్‌) వస్తున్నట్టు గుర్తించారు. అలాంటి వాటిలో ఏది సరైనదని ఒక్కోసారి మెదడు గందరగోళానికి గురవుతూ ఉంటుందని తేల్చారు. 

కొందరు వృద్ధులపై పరిశీలన జరిపి.. 
శాస్త్రవేత్తలు తాము గమనించిన అంశాలను ధ్రువీకరించడానికి కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. యువత, వృద్ధుల మధ్య కొన్ని టాస్కులతో పోటీ పెట్టారు. ఇందులో విశ్లేషణ, ఇతర అంశాలకు సంబంధించి వృద్ధులు తమ అపార జ్ఞానంతో త్వరగా టాస్కులు పూర్తిచేసినట్టు గుర్తించారు. అంటే సృజనాత్మకతలో, నిర్ణయాలు తీసుకోవడంలో యువత కంటే ముందంజలో ఉన్నట్టు తేల్చారు. కానీ జ్ఞాపకశక్తికి వచ్చేసరికి వృద్ధులు ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకాస్త లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని చెప్తున్నారు. తమ పరిశోధన ఆధారంగా పెద్ద వయసువారు గందరగోళానికి గురికాకుండా ఉండటానికి.. వారిలో జ్ఞాపకశక్తి పెంచడానికి ఉన్న మార్గాల అన్వేషణపై దృష్టిపెట్టామని పేర్కొంటున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top