బ్రిటన్‌లో 'మెనింజైటిస్' వ్యాప్తి.. ఇద్దరు మృతి, హై అలర్ట్ | Cases of invasive meningococcal disease notified in Kent, 2 died | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో 'మెనింజైటిస్' వ్యాప్తి.. ఇద్దరు మృతి, హై అలర్ట్

Mar 18 2026 4:08 AM | Updated on Mar 18 2026 4:08 AM

Cases of invasive meningococcal disease notified in Kent, 2 died

లండన్: బ్రిటన్‌లోని కాంటర్‌బరీ ప్రాంతంలో (కెంట్ రాష్ట్రం) మెనింజైటిస్ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి సోకడంతో ఓ పాఠశాల విద్యార్థి సహా ఇద్దరు మరణించినట్లు కెంట్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాధి లక్షణాలు ఉన్న మరో 11 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొంది. వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున కెంట్‌లో హై అలర్ట్ జారీ చేశారు. యూకే ఆరోగ్య భద్రతా సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. మెనింజైటిస్ సోకిన వారిలో 'సెప్టిసీమియా' లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.

మెనింజైటిస్‌ లక్షణాలు
మెనింజైటిస్ అనేది మెదడు మరియు వెన్నుపామును కప్పి ఉంచే పొరల వాపు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మెడను తిప్పడంలో ఇబ్బంది, కాంతిని చూడటంలో ఇబ్బంది, శరీరంపై ఎర్రటి మచ్చలు మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

సెప్టిసీమియా లక్షణాలు
శరీరంపై మచ్చలు కనిపిస్తే, వాటిని ఒక గాజుతో నొక్కి చూడాలి. గాజులో నుంచి చూసినప్పుడు ఆ మచ్చలు మాయం కాకపోతే, అది సెప్టిసీమియాకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అత్యవసర చికిత్స తీసుకోవాలి.

యాంటీబయాటిక్స్ కోసం క్యూ
మెనింజైటిస్‌ వ్యాప్తి నేపథ్యంలో కెంట్ విశ్వవిద్యాలయంలో వందలాది మంది విద్యార్థులు నివారణ యాంటీబయాటిక్స్ కోసం క్యూ కడుతున్నారు. విద్యార్థులలో వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, ఆరోగ్య శాఖ అధికారులు క్యాంపస్‌లను సందర్శించి నివారణ చర్యలు చేపడుతున్నారు.

ఇలా వ్యాప్తి చెందుతుంది
మెనింజైటిస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారికి అది వ్యాపిస్తుంది. బాక్టీరియా వల్ల కలిగే మెనింజైటిస్ గాలి ద్వారా లేదా స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది. మెనింజైటిస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లాలి. 

Advertisement
 
Advertisement
Advertisement