
ప్రేమికుల దినోత్సవం, స్నేహితులు దినోత్సవం మాదిరిగానే అన్నదమ్ముల దినోత్సవం(Brother's Day) ఉందనే సంగతి మీకు తెలుసా? అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ములే ఇంటిని చక్కదిద్దేవారుగా నిలుస్తుంటారు. వీరి అనుబంధం చక్కగా ఉన్నప్పుడే వారి కుటుంబానికి సమాజంలో మంచిపేరు వస్తుంది. ఈ రోజు మే 24.. జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ రోజుకున్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
భారతదేశంలో అనుబంధాలకు ఎంతో ప్రాముఖ్యత కనిపిస్తుంది. వాటిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అన్న, తమ్ముడు ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తుంటారు. అన్నదమ్ముల దినోత్సవాన్ని తొలుత తొలుత అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, సి డేనియల్ రోడ్స్ జరుపుకున్నారని చెబుతారు. 2005 నుంచి ప్రతి సంవత్సరం మే 24న ఈ బ్రదర్స్ డేని చేసుకుంటున్నారు. మొదట్లో దీనిని అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. తర్వాత ప్రపంచమంతటా జరుపుకోవడం ప్రారంభించారు. కొన్ని దేశాలలో అయితే ఈ రోజున అధికారిక సెలవుదినం(Holiday)గానూ ప్రకటించారు.
అన్న అంటే ఓ బాధ్యత. నాన్న తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది ఆయనే. అదే విధంగా తమ్ముడు కూడా బాధ్యతగానే మెలుగుతాడు. ఇక అమ్మాయిలైతే తమ బ్రదర్స్‌ను తమకు సెక్యూరిటీ కల్పించేవారిగా భావిస్తుంటారు. రక్త సంబంధం లేకపోయినా ఆత్మీయంగా ఇతరులను సోదర భావంతో చూసుకునే ప్రత్యేకమైన రోజు ఇది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా తమ ప్రియమైన సోదరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈరోజున తమ అన్నదమ్ములకు నచ్చిన వంటకాలను చేయడంతో పాటు వారికి నచ్చిన వస్తువులను కానుకలుగా అందజేస్తుంటారు. కొన్ని దేశాల్లో అన్నదమ్ముల దినోత్సవం నాడు సోదరులతో రోజంతా సరదాగా గడపడం, వారితో కలిసి టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లడంలాంటివి చేస్తుంటారు.
ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం