
బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్(Keir Starmer In India) భారత్‌కు చేరుకున్నారు. ముంబైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ పర్యటనకు బయల్దేరిన సమయంలో విమానం కాక్‌పిట్‌లో ప్రత్యక్షమై.. కాసేపు ఆయన సందడి చేశారు. ‘‘నేను మీ ప్రధానిని..’’ అంటూ ఇంటర్‌కామ్ ద్వారా ప్రయాణికులను ఉత్సాహంగా పలకరించారాయన.
లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో బయల్దేరే ముందు.. ‘‘కాక్‌పిట్ ఉంది మీ ప్రధాని. మీ అందరిని ఈ ప్రయాణంలో కలవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది బ్రిటన్ నుంచి భారత్‌కు పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్. కొత్త ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించేందుక ప్రయత్నిస్తాం. మీతో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమానం దిగాక మరిన్ని అప్‌డేట్స్ అందిస్తా’’ అంటూ నవ్వుతూ ఆయన అన్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు(UK PM In Cockpit Video).
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రెండ్రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. విజన్ 2035-Vision 2035 పేరిట ఇరు దేశాల భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. తన పర్యటనలో స్టార్మర్.. 125 మందికి పైగా వ్యాపార నాయకులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది. ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు.
అయితే ఈ రెండు దేశాల మధ్య జూలైలోనే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్‌లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్‌కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి.
ఇదీ చదవండి: నాలుగు రోజులుగా ట్రాఫిక్‌లోనే నరకం