అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే!

Bill And Melinda Separation Some Of World Most Expensive Divorces In History - Sakshi

బెజోస్‌ కాస్ట్‌లీ డైవోర్స్‌ 

వాషింగ్టన్‌: విడాకులు తీసుకోనున్నట్లు బిల్‌ గేట్స్‌ దంపతులు ప్రకటించడంతో గతంలో విడిపోయిన ప్రముఖుల వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ 2019లో విడాకులు తీసుకున్నారు. టెస్లా సంస్థ చీఫ్‌ ఎలన్‌ మస్క్‌ కూడా గతంలో రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. విడాకుల ఒప్పందంలో భాగంగా బెజోస్‌ తన భార్య మెక్‌కెంజీకి 38 బిలియన్‌ డాలర్ల (ప్రస్తుత మారక విలువ ప్రకారం రూ. 2.80 లక్షల కోట్లు) భారీ మొత్తం చెల్లించేందుకు అంగీకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఇక స్పేస్‌ ఎక్స్, టెస్లా సంస్థల ఓనర్‌ ఎలన్‌ మస్క్‌ మొదటి భార్య జస్టిన్‌ నుంచి 2008లో విడాకులు తీసుకున్నారు. జస్టిన్‌కు చెల్లించే మొత్తానికి సంబంధించి, పిల్లల బాధ్యతలకు సంబంధించి కోర్టు వెలుపల వారిరువురు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత బ్రిటిష్‌ నటి టలులా రిలేను మస్క్‌ వివాహం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే ఆమె నుంచి కూడా విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు దాదాపు 20 మిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. 

గేట్స్‌ దంపతుల ఆస్తుల పంపకం 
ఉమ్మడి ఆస్తులను పంచుకోవాలని భావిస్తున్నట్లు కింగ్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టులో దాఖలు చేసిన విడాకుల ఒప్పంద పత్రంలో బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ పేర్కొన్నారు. కాగా వివాహం అనంతరం సంపాదించిన ఆస్తులపై ఇద్దరికీ సమానంగా హక్కు ఉంటుందని వాషింగ్టన్‌ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. పరస్పర అంగీకారంతో ఆ ఆస్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మిలిందాకు భారీగా భరణం లభించే అవకాశం ఉందని, తద్వారా ఆమె ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో నిలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన విడాకులు.. భార్యలకు అత్యధిక భరణం చెల్లించిన భర్తలు తదితర వివరాలు తెలుసుకుందాం.
దిమిత్రి రైబోలోలెవ్‌- ఎలీనా రైబోలోలెవ్
అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ కంటే ముందు ఈ జంట విడాకులే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. 2014లో వీరు వివాహ బంధం నుంచి వైదొలిగారు. ఈ క్రమంలో బిలియనీర్‌ దిమిత్రి తన భార్య ఎలీనాకు 4.5 బిలియన్‌ డాలర్లు భరణంగా ఇచ్చారు.

ఎలిక్‌ వైల్డిస్టీన్‌- జోక్లిన్‌ వైల్డిస్టీన్
ఫ్రెంచ్‌లో జన్మించిన అమెరికన్‌ వ్యాపారవేత్త ఎలిక్‌. 1999లో ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఈ సందర్భంగా 3.8 బిలియన్‌ డాలర్లు భరణం రూపంలో చెల్లించారు.

రూపెర్ట్‌ మర్దోక్‌- అన్నా మర్దోక్‌ మన్‌
అమెరికన్‌ మీడియా మెఘల్‌ రూపెర్ట్‌ 31 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెబుతూ 1999లో తన భార్య అన్నా నుంచి విడిపోయారు. ఈ సందర్భంగా ఆమెకు 2.6 బిలియన్‌  డాలర్లు భరణం చెల్లించారు.

బెర్నీ ఎలెస్టోన్‌- స్లావికా ఎలెస్టోన్‌
ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు పొందిన ఐదో జంటగా బెర్నీ-స్లావికా జంట నిలిచింది. 2009లో విడిపోయిన ఈ జంట విడాకుల ఖరీదు- 1.2 బిలియన్‌ డాలర్లు.

స్టీవ్‌ వీన్‌- ఎలైన్‌ వీన్‌
కాసినో మొఘల్‌ స్టీవ్‌ వీన్‌ తన భార్య నుంచి విడిపోయే క్రమంలో సుమారు 1 బిలియన్‌ డాలర్ల భరణం చెల్లించారు. ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు స్టీవ్‌ వీన్‌పై రావడంతో ఆయన భార్య విడాకులు కోరినట్లుగా అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి.

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌- ఎమీ ఇర్వింగ్‌
ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోయారు. ఆ సమయంలో 100 మిలియన్‌ డాలర్లు ఎమీకి భరణంగా చెల్లించారు.

ఆసియాలో ఆమె మాత్రమే...
భర్త నుంచి విడాకులు పొంది.. తద్వారా లభించిన భరణంతో ఆసియాలోని సంపన్న మహిళల్లో ముందు వరుసలో నిలిచారు చైనాకు చెందిన యువాన్‌ లిపింగ్‌. షెంజన్‌ కాంగ్‌టాయ్ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్ కో. చైర్మన్‌ డూ వీమిన్ మాజీ భార్య ఆమె. విడిపోతున్న సందర్భంగా, యువాన్‌కు భర్త 163.3 మిలియన్‌ షేర్లు బదలాయించడంతో వీరి విడాకుల వ్యవహారం ఆసియాలోనే అత్యంత ఖరీదైన బ్రేకప్‌గా నిలిచింది. జూన్‌ 2, 2020న మార్కెట్లు ముగిసేనాటికి యువాన్‌ ఆస్తి 3.2 బిలియన్‌ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్‌ అప్పట్లో వెల్లడించింది. 

చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్‌ గేట్స్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top