ఉక్రెయిన్‌కు కోలుకోలేని దెబ్బకొట్టిన పుతిన్‌.. ఆందోళనలో యూరప్‌..!

Biggest Steel Works Destroyed Russian Troops In Mariupol - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. 25 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో పుతిన్‌ సేనల ధాటికి ఉక్రెయిన్‌ విలవిలాడుతోంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఇప‍్పటికే భారీగా నష్టపోయింది. ఉక్రెయిన్‌ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దాడుల కారణంగా పలు నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉక్రేనీయులు నిరాశ్రయులయ్యారు.

తాజాగా భీకర దాడుల్లో ఉక్రెయిన్‌లోని అజోవ్‌స్తాల్‌లో ఉన్న అతిపెద్ద ఐరన్‌, స్టీల్‌ ప్లాంట్‌ ధ్వంసమైంది. ఇది యూరప్‌లోని అతిపెద్ద స్టీల్‌ ప్లాంట్‌. ఈ ఘటనలో ఉక్రెయిన్‌కు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆ దేశ ఎంపీ లీసియా వ్యాసిలెన్కో ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ధ్వంసమైన కారణంగా పర్యావరణం కూడా దెబ్బతినే అవకాశం ఉన్నట్టు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మెటిన్‌వెస్ట్ గ్రూప్‌కు చెందిన అజోవ్‌స్టాల్ స్టీల్‌ ప్లాంట్‌, ఉక్రెయిన్‌లోని అత్యంత ధనవంతుడైన రినాట్ అఖ్‌మెటోవ్‌ ఆధీనంలో ఉంది.

మరోవైపు స్టీల్‌ ప్లాంట్‌ను రష్యా దళాలు ధ్వంసం చేయడంపై అజోవ్‌స్టాల్‌ డైరెక్టర్ జనరల్ ఎన్వర్ స్కిటిష్విలి స్పందిస్తూ.. తాము నగరానికి తిరిగి వచ్చిన తర్వాత ఉక్కు కర్మాగారాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. అయితే దాడుల వల్ల ఉక్కు పరిశ్రమకు ఎంత నష్టం వాటిల్లిందో వెల్లడించలేదు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించినప్పుడే పర్యావరణం దెబ్బతినకుండా ఉక్కు పరిశ్రమలో జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

మరోవైపు.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఖార్కివ్‌, మరియుపోల్‌ సహా పలు ప్రధాన నగరాలపై రష్యన్‌ బలగాలు మరింత విరుచుకుపడుతున్నాయి. కాగా, మరియుపోల్‌లోని ఆర్ట్ స్కూల్‌పై రష్యా దళాలు బాంబు దాడి చేశాయని, అక్కడ దాదాపు 400 మంది నివాసితులు ఆశ్రయం పొందారని సిటీ కౌన్సిల్ ఆదివారం తెలిపింది. ఈ దాడుల్లో భవనం ధ్వంసమైందని, శిథిలాల కింద బాధితులు ఉన్నారని కౌన్సిల్ పేర్కొన్నప్పటికీ, శనివారం జరిగిన దాడిలో ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. తాజాగా 18 నగరాలపై రష్యా సైనం దాడులు జరుపవచ్చనే సమాచారంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top