‘ట్రంప్‌కు భార్య పేరు కూడా గుర్తులేదు’.. అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శలు

Biden counter Trump Seth Meyers Interview Cant Remember Wife Name - Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉన్న వయసు ప్రభావం, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఈ విషయంలో ఆయనను పలువురు నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనపై వయసుకు సంబంధించి వస్తోన్న విమర్శలను మరోసారి తోసిపుచ్చారు. తన ప్రధాన పోటీదారుడైన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌ సైతం తప్పులు చేస్తున్నారని తెలిపారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తన భార్యను వేరే పేరుతో పిలిచారంటూ వెలుగులోకి వచ్చిన రిపోర్టును ప్రస్తావించారు. విత్ సేథ్‌ మేయర్స్‌ షోలో పాల్గొన్న బైడెన్ ట్రంప్‌పై విమర్శలు చేశారు.

‘మీరు అవతలి వ్యక్తి( డొనాల్డ్‌ ట్రంప్‌)ని గమనించాలి. ఆయనకు కూడా దాదాపు నా వయసే ఉంటుంది. ఆయన తన భార్య పేరును గుర్తుంచుకోలేరు’ అని బైడెన్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ ఆలోచనలన్నీ కూడా  కాలం చెల్లినవని అన్నారు. ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారా? లేదా తన మాజీ సహాయకుల్లో ఒకరిని అలా పిలిచారా? అనే దానిపై స్పష్టత మాత్రం లేదు.

 అధ్యక్షుడు బైడెన్ వయసు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఓ కీలక రిపోర్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 81 ఏళ్ల వయసున్న బైడెన్‌కు జ్ఞాపకశక్తి చాలా తగ్గిందని ఆ రిపోర్టు వెల్లడించింది. జీవితంలోని పలు కీలక విషయాలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని పేర్కొంది. తన కుమారుడు బ్యూ బైడెన్‌ ఎప్పుడు చనిపోయారనే విషయమూ ఆయనకు గుర్తులేదని తెలిపింది.  ఆయన యూఎస్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని పేర్కొంది. అయితే ఆయనపై వెలువడిన ఈ నివేదికను బైడెన్‌ తీవ్రంగా ఖండించారు.

ఇటీవల విమానం మెట్లు ఎక్కుతూ.. అయన తూలిపడిపోబోయారు. గతంలో ఓ వేదికపై ఎటువైపు నుంచి దిగాలో తెలిక తడబడిపోయారు. ఇటువంటి ఘటనులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి కూడా. అయితే ఈ ఘటనలు అన్నీ.. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆయనకు, డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా వీటినే రిపబ్లికన్ పార్టీకి ప్రచారానికి అస్త్రాలుగా ఉపయోగించుకుంటోంది. తనపై వస్తున్న ఆరోపణలకు చెక్‌ పెట్టే క్రమంలో బైడెన్‌.. ట్రంప్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు.

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top