ఢాకా: భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ మంత్రి మీర్జా ఫఖ్రుల్ అస్రాం ఆలంగీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరు దేశాల మధ్య సంబంధాలు గంగానది జలాల భాగస్వామ్య పునరుద్ధరణతోనే ఆధారపడి ఉంటాయన్నారు. బంగ్లాదేశ్ ప్రజల అంచనాలు మరియు అవసరాలకు అనుగుణంగా భారత్ కొత్త ఒప్పందంపై చర్చలు జరపాలని భారత్‌పై ఒత్తిడి తెచ్చారు.
1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రస్తుత గంగా నీటి ఒప్పందం ఈ ఏడాది (2026) డిసెంబర్‌తో ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ అంశంపై స్పందించింది. బీఎన్‌పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగిర్ మాట్లాడుతూ "భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగడం అనేది గంగా నీటి భాగస్వామ్య ఒప్పందం లేదా ఫరక్కా ఒప్పందంపై సంతకం చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే నీటి పంపిణీ ఒప్పందాలకు నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకుండా ఒప్పందం ఉండాలి". అన్నారు.
గంగా నది వివాదం
భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దు దాటిన తర్వాత గంగానది నేరుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ గంగానదిని పద్మానది అనే పేరుతో పిలుస్తారు. దిగువ దేశమైన బంగ్లాదేశ్ వ్యవసాయం, జీవవైవిధ్యం మరియు నీటి సరఫరాకు ఈ నది చాలా కీలకం.
కాగా కోల్‌కతా ఓడరేవులో పూడికను కొట్టుకుపోయేలా చేసి, హుగ్లీ నదిలో నావిగేషన్‌ను మెరుగుపరచడానికి ఫరక్కా బ్యారేజ్ భారత్ నిర్మించింది. అయితే దీనివల్ల ఎండాకాలంలో ఫరక్కా బారేజ్ వల్ల బంగ్లాదేశ్‌కు వచ్చే నీటి ప్రవాహం తగ్గిపోతోందని, దీనివల్ల ఉప్పునీటి శాతం పెరిగి, వ్యవసాయం, నదీ వ్యవస్థలు మరియు పర్యావరణం దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.
వివాదాస్పదంగా 'పద్మా బారేజ్' ప్రాజెక్ట్
ఫరక్కా బారేజ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి పద్మా నదిపై ఒక భారీ బారేజ్ నిర్మించే ప్రాజెక్ట్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ బ్యారేజ్ వల్ల భారత్‌లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని వాదిస్తోంది.
భారత్‌స్పందన
ఈ నీటి వివాదాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మాట్లాడారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 54 నదులు ఉన్నాయని వీటన్నిటిపై చర్చించడానికి ఇప్పటికే ఒక పటిష్టమైన ద్రైపాక్షిక యంత్రాంగం అందుబాటులో ఉందని తెలిపారు.అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధు నది నీటి ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడిందని తెలిపారు.


