ప్రజలు ఎన్నుకున్నా పవర్‌లో లేరెందుకు!

Aung San Suu Kyi Detained As Mlitary Seizes Control - Sakshi

ఆంగ్‌ సాన్‌ సూకీ

జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తికి ఎంతటి ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల్లో ఘన విజయం సాధించినా మయన్మార్‌ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. ఆ పవర్‌ లేనందు వల్లనే మయన్మార్‌ సైన్యం తాజాగా మరొకసారి దేశంలోని ‘ప్రజా పాలన’ను∙చేజిక్కించుకుంది. సూకీని నిర్బంధించింది.  

సూకీకి అప్పుడు 43 ఏళ్లు
8–8–88. ఆగస్టు 8, 1988. రంగూన్‌లో ప్రజలు ఎక్కడికక్కడ గుమికూడుతున్నారు. పిడికిళ్లు ఎక్కడివక్కడ బిగుసుకుంటున్నాయి. నలు దిక్కులా ప్రజాస్వామ్యం కోసం నినాదాలు! విశ్వవిద్యాలయాల విద్యార్థులు, బౌద్ధ భిక్షువులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, యువకులు, గృహిణులు, చిన్నపిల్లలు... ‘విప్లవం వర్థిల్లాలి’ అంటూ ఇళ్ల నుంచి, మఠాల నుంచి, పాఠశాలల నుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి పరుగులు తీస్తూ బయటికి వస్తున్నారు. ఉద్యమ ప్రకంపనలు దేశంలో ప్రతిచోటా ప్రతిధ్వనించడం మొదలైంది. వక్తలు ఆవేశంగా ప్రసంగిస్తున్నారు. బుద్ధుడిని, మార్క్స్‌ని కలిపి బర్మాను సోవియెట్‌ యూనియన్‌లా మార్చేందుకు ‘కమ్యూనిస్టు నియంత’ నెవిన్‌ చేసిన ప్రయోగాలు వికటించి బర్మాకు తిండి కరువైంది. చివరికి తిరుగుబాటు ఒక్కటే ప్రజలకు మిగిలిన తిండీబట్టా అయింది. ఆ తిరుగుబాటు కు నాయకత్వం వహించడానికి సూకీ బయటికి వచ్చారు. ఆ తర్వాత బర్మా సైనిక పాలకులు ఆమెను దాదాపు పదిహేనేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. 


ఆరేళ్ల వయసులో (1951) సూకీ

సూకీ వయసిప్పుడు 75 ఏళ్లు
2020 నవంబర్‌ 8. మయన్మార్‌ పార్లమెంటు ఎన్నికల్లో సూకీ పార్టీ ‘నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ’ (ఎన్‌.ఎల్‌.డి.) ఘన విజయం సాధించింది. సూకీ అధ్యక్షురాలు అవ్వాలి. కానీ కాలేరు! అయ్యేపనైతే అంతకుముందు 2015లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించినప్పుడే కావలసింది. ఆంగ్‌సాన్‌ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్‌ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తి మయన్మార్‌ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. అందుకు మిలటరీ ఒప్పుకోవాలి. మిలటరీ ఒప్పుకునే పనైతే మొన్న సోమవారం సూకీని, మయన్మార్‌ దేశ అధ్యక్షుడిని, మరికొంతమంది ఎన్‌.ఎల్‌.డి. నేతల్ని సైన్యం నిర్బంధించి, దేశాన్ని తన అధీనంలోకి తీసుకునే వరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మొన్నటి నవంబర్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కనుక, ఏడాది ఆగి సక్రమ ఎన్నికలు జరిపిస్తామని సైన్యం అంటోంది. అంతవరకు సూకీ నిర్బంధంలోనే ఉండే అవకాశం అయితే ఉంది.

88కి ముందు సూకీ ఎక్కడున్నారు?
పెద్ద చదువులు చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ దాదాపు నలభై ఏళ్ల పాటు విదేశాల్లో గడిపి, 1988లో మయన్మార్‌ వచ్చిన ఏడాదే ఉద్యమ శక్తిగా అవతరించారు సూకీ. ‘ఆ శక్తి నాకు నా తండ్రి, బర్మా ప్రజలు ఇచ్చిన శక్తి’ అని చెప్తారు సూకీ. ఆమె తండ్రి దేశభక్త విప్లవకాý‡ుడు. అసలు ఆంగ్‌ సాన్‌ సూ కీ అన్న పేరులోనే మూడు తరాల శక్తి ఉంది. ‘ఆంగ్‌ సాన్‌’ అన్నది ఆమె తండ్రి పేరు. ‘సూ’ అన్నది తాతగారి (నాన్న నాన్న) పేరు. ‘కీ’ అన్నది అమ్మ పేరు. సూకీ రంగూన్‌లో జన్మించారు. పాలిటిక్స్, ఫిలాసఫీ చదివారు. బ్రిటిష్‌ పౌరుడు మైఖేల్‌ ఆరిస్‌ ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు. తర్వాత మయన్మార్‌ వచ్చి ఉద్యమం బాట పట్టారు. ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఫలితంగా గృహ నిర్బంధానికి గురయ్యారు. సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. 2015 పార్లమెంటు ఎన్నికల్లో, తిరిగి మొన్నటి 2020 ఎన్నికల్లో భారీ మెజారిటీతో నెగ్గారు. తొలి ఎన్నికలు (2015) ఆమె సాధించిన నోబెల్‌ శాంతి బహుమతి కంటే గొప్ప విజయంగా చెబుతారు అక్కడి ప్రజలు. 

ఇక ఏం జరగబోతోంది?
కుట్రపూరితంగా తిరుగుబాటు చేసి ఈ సోమవారం (ఫిబ్రవరి 1) మయన్మార్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్న సైన్యం ఏడాది లోపే తిరిగి పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతవరకు సూకీ సహా ముఖ్య నేతలందరూ నిర్బంధంలోనే ఉండొచ్చు. అయితే సూకీ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా బాగుండటం లేదని వార్తలు అందుతున్నాయి. 2003 లోనే.. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు.. ఆమెకు స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యకు అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత 2013లో పాదానికి, 2016 లో కంటికి శస్త్ర చికిత్సలు జరిగాయి. సూకీని నిరంతరం పర్యవేక్షిస్తుండే డాక్టర్‌ టిన్‌ మియో విన్‌ ఆమె మరీ 48 కిలోల బరువు మాత్రమే ఉన్నారని, రక్త పీడనం కూడా బాగా తక్కువగా ఉంది కనుక తేలికగా ఆమె బలహీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని అప్పట్లోనే జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతానికి సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు. సూకీ భర్త 1999 లో 53 ఏళ్ల వయసులో మరణించారు. కొడుకులిద్దరూ బ్రిటన్‌ నుంచి వచ్చి పోతుంటారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top