America Was Hit By A Powerful Storm System Kills Alteast 2, Flights Were Cancelled Or Delayed - Sakshi
Sakshi News home page

Severe Storm Hits US: తీవ్ర తుపానుతో అమెరికా అతలాకుతలం.. 11 లక్షల ఇళ్లల్లో అంధకారం

Published Wed, Aug 9 2023 1:25 AM

America was hit by a severe storm - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని తూర్పు తీర రాష్ట్రాలను భీకర తుపాను వణికిస్తోంది. బలమైన గాలులు, భారీ వర్షాలకు సంబంధించిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. విద్యుత్‌ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. టెన్నెస్సీ నుంచి న్యూయార్క్‌ వరకు 10 రాష్ట్రాల్లోని 11 లక్షల నివాసాల్లో అంధకారం అలుముకుంది. సుమారు 3 కోట్ల మందిపై తుపాను ప్రభావం పడింది. తమ ప్రాంతంలోని విద్యుత్‌ లైన్లను మరమ్మతు చేసేందుకు కొన్ని రోజులు పట్టవచ్చని నాక్స్‌విల్లె యుటిలిటీ బోర్డ్‌ తెలిపింది.

అలబామాలోని ఫ్లోరెన్స్‌లో సోమవారం పిడుగుపాటుకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సౌత్‌ కరోలినాలోని అండెర్సన్‌ కౌంటీలో చెట్టు కూలి పడటంతో ఓ బాలుడు(15) చనిపోయాడు. భారీ వర్షాలు, గంటకు 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో విమాన, రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎనిమిది వేల విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. మరో 2,600 విమాన సర్వీసులు రద్దయ్యాయి.

తూర్పు తీర ప్రాంతం వైపు రావాల్సిన విమానాలను దారి మళ్లించినట్లు ఫెడరల్‌ ఏవియేషన్‌ తెలిపింది. వందలాదిగా ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. చెట్లు కూలి రహదారులు, నివాసాలపై పడిపోయాయి. విధులకు హాజరైన ఉద్యోగులను తుపాను కారణంగా ముందుగానే ఇళ్లకు చేరుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో ఇంతటి తీవ్ర తుపాను ఇదేనని జాతీయ వాతావరణ విభాగం పేర్కొంది. 

Advertisement
Advertisement