New York: రన్‌వేపై ఫైర్‌ ట్రక్కును ఢీకొన్న ‘ఎయిర్ కెనడా’ | Air Canada Express plane collides with vehicle at New Yorks LaGuardia airport | Sakshi
Sakshi News home page

New York: రన్‌వేపై ఫైర్‌ ట్రక్కును ఢీకొన్న ‘ఎయిర్ కెనడా’

Mar 23 2026 10:55 AM | Updated on Mar 23 2026 11:46 AM

Air Canada Express plane collides with vehicle at New Yorks LaGuardia airport

న్యూయార్క్: అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఒక విమానం రన్‌వేపై గ్రౌండ్ వెహికల్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 100 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ కెనడా సీఆర్జే (CRJ) ఫ్లైట్ ఏసీ 8646 విమానం రన్‌వే 04/22ను దాటేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడ నిలిపి ఉంచిన ‘ట్రక్ 1’ అనే ఫైర్ ఇంజిన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) అప్రమత్తమై, లాగార్డియా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమానాల రాకపోకలను నిలిపివేస్తూ ‘గ్రౌండ్ స్టాప్’ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో విమానం రన్‌వేపై కదులుతూ ఉన్నట్లు స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను చూస్తే.. విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విజువల్స్‌ను విమానయాన అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. గాయపడిన వారి సంఖ్య, పరిస్థితిపై ఎయిర్‌పోర్ట్ లేదా ఎయిర్ లైన్స్ వర్గాల నుండి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.

ఈ ప్రమాదం కారణంగా లాగార్డియాలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాప్యం లేదా విమానాల దారి మళ్లింపుపై అధికారులు ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భద్రతా పరమైన చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement