చైనా వెళ్లిన భారతీయుల్లో 19 మందికి పాజిటివ్‌

19 Indians Test Covid Positive on Vande Bharat Flight to Wuhan - Sakshi

బీజింగ్‌: వందే భారత్‌ మిషన్(వీబీఎం)‌లో భాగంగా ఢిల్లీ నుంచి చైనా సెంట్రల్‌ సిటీ వుహాన్కి వెళ్లిన  ఏయిరిండియా విమానంలో 19 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో త్వరలో చైనా వెళ్లబోయే విమనాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. విమానంలోని మొత్తం 277 మంది ప్రయాణికుల్లో 39 మందికి చాలా తక్కువ లక్షణాలున్నట్లు తెలిసింది. వీరంతా గతంలో కోవిడ్‌ బారిన పడి కోలుకున్నట్లు సమాచారం. వీరిలో యాంటీబాడీలను కూడా గుర్తించారు. మొత్తం 58 మంది ప్రయాణికులను కోవిడ్‌-19 ఆస్పత్రులకు, క్వారంటైన్‌ల సెంటర్లకు తరలించారు. మిగిలిన ప్రయాణీకులు ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో భాగంగా ప్రభుత్వం సూచించిన హోటళ్లలో ఉన్నారు. ఇక ఇండియా నుంచి చైనా వెళ్లిన వందే భారత్‌ మిషన్‌లో అత్యధిక కోవిడ్‌-19 కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. (చదవండి: చైనాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన)

ఇక శుక్రవారం చైనా చేరుకున్న విమానం ఆరవ వీబీఎం ఎయిర్‌ ఇండియా విమానం. ఇంకా 1500 మంది భారతీయులు చైనా వెళ్లడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేడు వీబీఎం విమానంలో పెద్ద మొత్తంలో కోవిడ్‌ కేసులు వెలుగు చూడటంతో నెలాఖరులో వుహాన్‌కు వెళ్లబోయే విమానాన్ని వాయిదా వేయడానికి దారితీయవచ్చు. ఇక నవంబరులో మరో విమానం పంపేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇండియా చైనాకు లేఖ రాసింది. కానీ ఇంకా స్పందన రాలేదు. అయితే అనుమతి పొందడం అంత సులభం కాదు. తూర్పు చైనా జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్బోలోని అధికారులు సెప్టెంబర్ 11 న మొదటి విమానంలో పాజిటివ్ రావటంతో రెండవ వీబీఎం విమానానికి అనుమతి నిరాకరించారు. (చదవండి: మహమ్మారి గురించి మీకేం తెలుసు!?)

ఇక సెప్టెంబర్‌ 14న న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఇండియా నుంచి చైనా వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా డబుల్‌ యాసిడ్‌ టెస్ట్‌లు చేయించుకోవాల్సిందిగా ఆదేశించింది. ప్రయాణానికి 120 గంటల ముందు ఒకసారి.. తర్వాతిది 36 గంటలకు మరొక సారి తప్పక టెస్ట్‌లు చేయించుకోవాలని ఆదేశించారు. అది కూడా ఐసీఎంఆర్‌ ల్యాబ్‌ల్లో మాత్రమే అని తెలిపారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top