గిన్నిస్‌లోకి ‘హిరోకజు టనాకా’లు

178 People Named Hirokazu Tanaka Break Guinness World Record - Sakshi

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులైతే దాదాపు ఏడుగురి దాకా ఉంటారంటారుగానీ ఒకే పేరుగల వారి సంఖ్యకు మాత్రం కొదవేం ఉంది. మన వీధి, ఊరు, ప్రాంతం మొదలు విదేశాల వరకు ఒకే పేరుతో బోలెడు మంది ఉంటుంటారు. వారిలో కొందరు మనకు తారసపడుతుంటారు కూడా.. మరి అలాంటి వారంతా ఒకేచోటకు చేరితే? జపాన్‌ రాజధాని టోక్యోలోని ఓ ఆడిటోరియంలో ఇదే జరిగింది.

‘హిరోకజు టనాకా’ అనే పేరుగల 178 మంది ఒకేచోట కలుసుకొని ‘ఒకే పేరుగల వ్యక్తులతో కూడిన అతిపెద్ద సమూహం’గా సరికొత్త గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. హిరోకజు టనాకా అనే పేరుగల వాళ్లలో మూడేళ్ల బుడతడు దగ్గర నుంచి వియత్నాం నుంచి వచ్చిన 80 ఏళ్ల బామ్మ వరకు ఉన్నారు. టోక్యోలో పనిచేసే హిరోకజు టనాకా అనే ఓ కార్పొరేట్‌ కంపెనీ ఉద్యోగి ఒకరోజు తన పేరుతోనే ఉన్న ఓ బేస్‌బాల్‌ ఆటగాడి ప్రతిభ గురించి తెలుసుకొని ముచ్చటపడ్డాడు.

ప్రపంచవ్యాప్తంగా తన పేరుతోనే ఉన్న వ్యక్తులందరినీ ఒకేచోటకు చేర్చాలనుకొని అందుకోసం ప్రచార ఉద్యమం మొదలుపెట్టాడు. అతని ప్రయత్నం ఫలించి ఆ పేరుతో ఉన్న 178 మంది ఒకేచోటకు చేరుకున్నారన్నమాట. గతంలో ఈ రికార్డు మార్తా స్టివార్ట్స్‌ అనే పేరుతో ఉన్న 164 మంది పేరిట ఉండేది. 2005లో వారంతా ఇలాగే అమెరికాలో కలుసుకున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top