
ఆరు వాహనాలు సీజ్
అందులో ఫిట్‌నెస్ లేని నాలుగు స్కూల్ బస్సులు కూడా..
కేపీహెచ్‌బీ కాలనీ: వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో రోడ్లపైకి వస్తున్న స్కూల్ బస్సులపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులను, సరైన ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మూడు రోజులుగా కూకట్‌పల్లి ప్రాంతీయ రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం తులసివనం వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఫిట్‌నెస్ లేని నాలుగు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. టాక్స్ చెల్లించని మరో రెండు వాహనాలను సీజ్ చేశారు. వీటితోపాటు నిబంధనలకు విరుద్ధంగా బస్సులో ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల బస్సులను కూడా సీజ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనుబాబు తెలిపారు. సరైన అనుమతి పత్రాలు లేకుండా కనీసం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా తిరుగుతున్న మూడు స్కూల్ బస్సులను ఇన్‌స్పెక్టర్ శ్రీనుబాబు ఆధ్వర్యంలో బుధవారం సీజ్ చేశారు. మంగళవారం కూడా ఒక స్కూల్ బస్సు ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతుండటంతో పట్టుకున్నట్లు శ్రీనుబాబు తెలిపారు. పన్నులు చెల్లించని మరో రెండు వాహనాలను కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో ప్రధానంగా ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అగ్నిమాపక పరికరాలు, వాహన ఫిట్‌నెస్ వంటివి లేకుంటే చర్యలు తప్పవని ఎంవీఐ హెచ్చరించారు.