
‘సీఅండ్‌డీ’.. పకడ్బందీ
నిర్మాణ వ్యర్థాలు రీసైక్లింగ్‌కు పంపిస్తేనే ఓసీ
జరిమానాలూ భారీగా..
బహిరంగ ప్రదేశాల్లో సీఅండ్‌డీ వ్యర్థాలు వేసేవారికి ఇప్పటికే భారీ జరిమానాలున్నప్పటికీ, వాటిని మరింత పెంచే ఆలోచనలో అధికారులున్నట్లు తెలిసింది. సీఅండ్‌డీ వ్యర్థాల్ని నాలాలు, చెరువుల్లో వేస్తుండటంతో ముంపు సమస్యలు పెరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో వేస్తుండటంతో సదరు స్థలాలు వినియోగంలో లేకుండాపోతున్నాయి. పర్యావరణపరంగానూ కాలుష్య సమస్య ఉత్పన్నమవుతోంది. రోడ్ల పక్కన వేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు నగర ఇమేజ్ దెబ్బతింటోంది. దీంతో ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ ఈ వ్యర్థాలు వేస్తే మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి రూ.50వేలు, మూడోసారి లక్ష రూపాయల జరిమానా విధించేలా నిబంధనలున్నా ఉల్లంఘనలు జరుగుతుండటంతో జరిమానాలు ఇంకా పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో పది లక్షల జనాభా మించిన నగరాల్లో ఆరో స్థానంతోపాటు వ్యర్థాలు లేని నగరాల విభాగంలో సెవెన్‌స్టార్ ర్యాంక్ పొందిన జీహెచ్‌ఎంసీ.. స్వచ్ఛ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని భావిస్తోంది. ఏటా ర్యాంకులు, అవార్డులైతే వస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వాస్తవ పరిస్థితుల్లోనూ మార్పు తేవాలనే దిశగా చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఫోన్ చేస్తే చెత్త తరలించే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ, నిర్మాణ.. కూల్చివేతల (సీఅండ్‌డీ) వ్యర్థాల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనుంది. పెద్ద భవనాలను నిర్మించే రియల్టర్లు నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ సదుపాయాలున్న జీహెచ్‌ఎంసీచే గుర్తింపు పొందిన అధీకృత ఏజెన్సీలకే పంపించేలా తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ(జీహెచ్‌ఎంసీ) కార్యదర్శి ఇలంబర్తి సూచనలకనుగుణంగా ఈ మేరకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టౌన్‌ప్లానింగ్ విభాగం భవన నిర్మాణ అనుమతుల నిబంధనల్లోనే సదరు అంశాన్ని చేర్చి పాలకమండలి, ప్రభుత్వ ఆమోదంతో దాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. తద్వారా వ్యర్థాలను అధీకృత ఏజెన్సీలకు పంపిస్తేనే నిర్మాణాలు పూర్తయ్యాక ఆక్యుపెన్సీసర్టిఫికెట్ (ఓసీ ) ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.
5–10 శాతం రీసైక్లింగ్ పునరుత్పత్తులే..
పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానే కొత్తగా భవనాలు నిర్మించే వారికి భవన నిర్మాణ అనుమతి ఫీజులతో పాటే నిర్మాణ వ్యర్థాల ఫీజులను ఇప్పటికే వసూలు చేస్తున్నారు. రియల్టర్లు తమ ప్రాజెక్టు ల్లో 5–10 శాతం రీసైక్లింగ్ పునరుత్పత్తుల్నే వాడాల ని కూడా సూచించనున్నారు. రీసైక్లింగ్ ఉత్పత్తులైన మిక్స్‌డ్ కంకర, ఇసుక, ఇటుకలు, కెర్బ్ స్టోన్స్‌ను రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వివిధ ప్రాంతాల్లో వాడవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా నగరంలో ఎక్కడ పడితే అక్కడ సీఅండ్‌డీ వ్యర్థాలు లేకుండా చేయడంతో పాటు రీసైక్లింగ్ ప్లాంట్లున్న అధీకృత ఏజెన్సీల పునరుత్పత్తులు పూర్తిస్థాయిలో వినియోగమవుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ ఉత్పత్తులకు అంతగా డిమాండ్ లేకపోవడంతో పాటు చాలామంది బిల్డ ర్లు నిర్మాణ వ్యర్థాలను నాలాలతో సహా బహిరంగ ప్రదేశాల్లో వేస్తుండటంతో ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఏజెన్సీలు తమకు అంతగా ఆదాయం రా వడం లేదని ఆరోపిస్తున్నారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
అందుకనుగుణంగా టౌన్‌ప్లానింగ్ నిబంధనలు
వ్యర్థాల సమస్య పరిష్కారం కోసం అమలు
చర్యలకు సిద్ధమవుతోన్న జీహెచ్‌ఎంసీ