ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?

Sep 2 2025 1:33 PM | Updated on Sep 2 2025 6:37 PM

ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?

ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు?

జీవోలకే పరిమితమైన ‘ఫ్యూచర్‌’

నిర్మాణ సంస్థలు, దరఖాస్తుదారులకు తప్పని పడిగాపులు...

లే అవుట్‌ల కోసం భూములు సిద్ధం

అనుమతులు లేకే ఆగుతున్న నిర్మాణాలు

సాక్షి ,సిటీబ్యూరో: ‘ఫ్యూచర్‌’కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఫ్యూచర్‌ సిటీలో చేపట్టే నిర్మాణాలకు ఇంకా అనుమతులు లభించలేదు. లే అవుట్‌లు, నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు, నిర్మాణ సంస్థలు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిపాలన యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఇప్పటివరకు దాని కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. మరోవైపు ప్రస్తుతం ఫ్యూచర్‌ సిటీ ఉన్న ప్రాంతాల్లో గతంలో డీటీసీపీ అనుమతులు ఇచ్చింది. 

అయితే ట్రిపుల్‌ ఆర్‌ వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించడంతో డీటీసీపీ ఆ బాధ్యతల నుంచి వైదొలిగింది. నిబంధనల మేరకు ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఎఫ్‌సీడీఏ)యే అన్ని రకాల ప్రొసీడింగ్స్‌ను అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను సైతం వెలువరించింది. కానీ, క్షేత్రస్థాయి, ప్లానింగ్‌ విభాగంలో తగినంత నిపుణులు, సిబ్బంది లేకపోవడం వల్ల ఆ బాధ్యతలను హెచ్‌ఎండీఏకు అప్పగించారు. సాంకేతికంగా ఎఫ్‌సీడీఏ సంస్థ నుంచే అనుమతులు లభిస్తాయి. అంతర్గతంగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. కానీ, ఈ దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.

అభివృద్ధికి ఆటంకాలు...

‘రూ.కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేశాం. లే అవుట్‌లు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, ప్రొసీడింగ్స్‌ లభించకపోవడం వల్ల వడ్డీల రూపంలో పెద్ద ఎత్తున నష్టపోతున్నాం’అని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. డీటీసీపీ పరిధిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రొసీడింగ్స్‌ లభించాయని, ఫ్యూచర్‌ సిటీలో మాత్రం సుమారు ఏడాది కాలంగా ప్రతిష్టంభన నెలకొందని అన్నారు. ఈ ప్రతిష్ఠంభన కారణంగాపెద్ద పెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థలే కాకుండా సాధారణ, మధ్య తరగతి వర్గాలు సైతం ఆర్థికంగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. 

ఎఫ్‌డీసీఏ, హెచ్‌ఎండీఏల మధ్య కొరవడిన సమన్వయం వల్లే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా వందలకొద్దీ దరఖాస్తులు పెండింగ్‌ జాబితాలోనే ఉన్నాయి. గతంలో డీటీసీపీ వద్ద దరఖాస్తు చేసు కున్న ఫైళ్లను సైతం హెచ్‌ఎండీఏకు బదిలీ చేశారు. ‘ట్రిపుల్‌ ఆర్‌ వరకు ఉన్న హెచ్‌ఎండీఏ పరిధికి చెందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ యధావిధిగా కొనసాగుతోంది. హెచ్‌ఎండీఏ నుంచే అనుమతులు లభిస్తున్నాయి. ఫ్యూచర్‌ సిటీ పరిధికి చెందిన దరఖాస్తుల పరిశీలనలో మాత్రం జాప్యం జరుగుతోంది’అని ఫ్యూచర్‌ సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. ఈ కాలయాపన వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొంటున్నారు.

765 చ.కి.మీ.లలో బ్రేక్‌

● హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిని రీజినల్‌ రింగ్‌రోడ్డు వరకు విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో 7,250 చ.కి.మీ.ల నుంచి 10,472 చ.కి.మీ.ల వరకు హెచ్‌ఎండీఏ కార్యకలాపాలు విస్తరించాయి.

● ఫ్యూచర్‌ సిటీ పరిధిలోని 765 చ.కి.మీ.పరిధిలో ఉన్న 56 గ్రామాల్లో మాత్రం అనుమతులకు బ్రేక్‌ పడింది.

● గతంలో డీటీసీపీ పరిధికి చెందిన ఈ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అనుమతులు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటైన తరువాతనే ఆటంకాలు ఎదురుకావడం గమనార్హం.

● గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లు, రేడియల్‌ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

● రావిర్యాల నుంచి ఆమన్‌గల్‌ వరకు రెండు దశల్లో గ్రీన్‌ఫీల్డ్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

● ఈ క్రమంలో రియల్‌ ఎస్టేట్‌రంగం పరుగులు తీస్తుందని భావించిన సంస్థలు, వ్యక్తులకు ప్రొసీడింగ్స్‌ లభించకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement