
కొత్త కార్డులకు రేషన్ పంపిణీ షురూ
సాక్షి, సిటీబ్యూరో: ఆశావహుల పరేషాన్ వీడింది. కొత్త రేషన్ కార్డుల లబ్ధి అందింది. కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ సోమవారం ఆరంభమైంది. సుమారు లక్షన్నర కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. మూడు నెలలుగా రేషన్‌కార్డులు మంజూరవుతున్నా నెలవారీ కోటా మాత్రం కేటాయించలేదు. పౌర సరఫరాల శాఖ పాత కార్డులకు జూన్‌లోనే ఒకేసారి మూడు నెలలు కోటా కేటాయించి పంపిణీ చే సింది. తాజాగా పాత కార్డుదారులతోపాటు కొత్త కార్డుదారులకు సైతం సెప్టెంబర్ కోటా కేటాయించి విడుదల చేసి పంపిణీ ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుదారులు ఉదయం నుంచే ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు క్యూ కట్టారు.
అర్బన్‌లో 13.88 లక్షలకుపైనే కుటుంబాలు
గ్రేటర్ పరిధిలో ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలు సుమారు 13.88 లక్షలపైనే కాగా, అందులో సుమారు కోటిన్నరకుపైగా లబ్ధిదారులుగా ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుకు ఆరు కిలోల చొప్పన సన్నబియ్యం ప్రతి నెలా కోటా విడుదలవుతోంది. ప్రతి నెలా 15వ తేదీ వరకు సెలవు రోజు మినహా మిగతా రోజుల్లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ సాగుతోంది. ఈ నెల కొత్త కార్డుదారులు నెలవారీ కోటా డ్రా చేయడానికి పోటీ పడ్డారు. ఉచితంగా సన్న బియ్యం అందడంతో కొత్త కార్డుదారుల్లో ఆనందం వ్యక్తమైంది.