
నిమజ్జనానికి సర్వం సన్నద్ధం
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. నగరవ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. సోమవారం ఆయన నెక్లెస్ రోడ్డు మార్గంలో పీపుల్స్ ప్లాజా, సన్ రైజింగ్ పాయింట్, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మకుంట, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్‌లలో నిమజ్జన ఏర్పాట్లను అదనపు కమిషనర్ రఘుప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. బారికేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని 20 ప్రధాన చెరువులతోపాటు చిన్న విగ్రహాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ మేరకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు నిధులను జీహెచ్‌ఎంసీ కేటాయించిందని చెప్పారు. నగరంలోని అన్ని ప్రధాన చెరువుల వద్ద 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. హైడ్రా, పర్యాటక శాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లను, డీఆర్‌ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని వివరించారు. పోలీసుల సహకారంతో 13 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేశ్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు నియమించామని చెప్పారు.
స్వచ్ఛతపై దృష్టి..
వేడుకల్లో స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, 14,486 మంది శానిటేషన్ వర్కర్స్ మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారని కమిషనర్ తెలిపారు. వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటివరకు 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లు ఉపయోగించి 3 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను డంపింగ్ యార్డు కు తరలించామని చెప్పారు. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో 39 మొబైల్ టాయిలెట్లు, ఊరేగింపు మార్గంలో మొత్తం 56,187 తాత్కాలిక వీధిదీపాలు సిద్ధం చేసినట్లు వివరించారు. మూడు షిఫ్టుల్లో పనిచేసేలా అంబులెన్స్‌లతో సహా 7 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
90 శాతానికిపైగా గుంతల పూడ్చివేత
రోడ్డు సేఫ్టీ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 90 శాతానికిపైగా గుంతలను పూడ్చివేశామని కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న మిగతా గుంతలను ఇంజనీరింగ్ విభాగం పూడ్చుతుందన్నారు.
సకాలంలో విగ్రహాలను తరలించాలి
సకాలంలో గణేష్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా కమిషనర్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేశ్ ప్రతిమల ఊరేగింపు మార్గాల్లో నిర్దేశించిన గార్బేజి పాయింట్లలోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను కమిషనర్ కోరారు.
303 కిలోమీటర్ల మేర నిమజ్జన శోభాయాత్ర
ఊరేగింపు మార్గాల్లో రోడ్లకు మరమ్మతులు..
3 షిఫ్టుల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు..
విధుల్లో 14,486 మంది సిబ్బంది
నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్