
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు సీపీ సీవీ ఆనంద్. హైదరాబాదులో 1,40,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పుకొచ్చారు. గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగియడానికి పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈరోజు సాయంత్రం వరకు 900 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంటుంది. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం నిమజ్జనం త్వరగా చేపట్టడంతో మిగతా గణేష్ నిమజ్జన కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాం. ఈసారి హైదరాబాదులో ఎక్కువ గణేష్ విగ్రహాలు ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కొన్ని విగ్రహాలు 40 అడుగుల వరకు ఎత్తులో ఉన్నాయి. గణేష్ నిమజ్జనం కార్యక్రమాలకు ప్రశాంతంగా కొనసాగడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, వాటర్ బోర్డ్ అధికారులు బాగా సహకరించారు.
గణేష్ విగ్రహాల దగ్గర ఆకతాయిల ఆట కట్టించడానికి ఈసారి షీ టీమ్స్ బాగా పనిచేశాయి. 170 మందిపై కేసులు నమోదు చేశాం. గణేష్ మండపాల దగ్గర అక్కడక్కడ గొడవలు జరిగాయి. ఐదుగురిపై కేసులు నమోదు చేశాం. హై రైజెడ్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయగలిగాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేయడం మంచిదే’ అని చెప్పుకొచ్చారు.