
హైదరాబాద్: ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కంటే పౌరస్పృహ చాలా కీలకం. ఎంత అత్యాధునిక సిగ్నల్స్ ఏర్పాటు చేసినా ఓ వ్యక్తి రెడ్ లైట్ ఉన్నప్పుడు సిగ్నల్ జంప్ చేస్తే ఉపయోగం ఉండదు. విద్యార్థి దశలో నాకు లైసెన్స్ అంటే ఏమిటో తెలీదు. మా అన్న డ్రైవింగ్ నేర్పాడు... నేను వాహనం నడుపుతూ తిరిగేశా. అప్పుడు ఏ రూల్స్ నాకు తెలీదు. పాఠశాల, కళాశాలల్లో రహదారి భద్రత నిబంధనలు చెప్పకపోవడం వల్లే అలా జరిగింది.
గతంలో అప్పటి గవర్నర్ నరసింహన్‌ను కలిసినప్పుడు ఆయన హైదరాబాద్ ఫుట్‌పాత్స్ లేని అద్భుత నగరమని అన్నారు. కొందరు ఇక్కడ ఉన్న వాటినీ వినియోగించుకోరు. మౌలిక వసతుల లేమి వల్లే ఫస్ట్–లాస్ట్ మైల్ కనెక్టివిటీ సాధ్యం కాలేదు. ఈ కారణంగానే వ్యక్తిగత వాహనాల వినియోగం పెరుగుతోంది. భారీ భవనాలకు అనుమతి ఇచ్చే ముందు ట్రాఫిక్ పోలీసులను భాగస్వాములను చేయడం లేదు. వాటి నిర్మాణం వల్ల వచ్చే ట్రాఫిక్ ఇబ్బందుల్ని అధ్యయనం చేయట్లేదు. విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరం.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ