
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద కనిష్టంగా ఇద్దరు, గరిష్టంగా ముగ్గురు చొప్పున ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారు. వీళ్లు ఆయా జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తుంటారు. ఇలాంటి రెండు జంక్షన్ల మధ్య ఉన్న మార్గంలో ఇబ్బంది ఏర్పడితే! అప్పుడు స్పందించాల్సింది ఎవరు? ఆ మార్గాన్ని పర్యవేక్షించడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానంగా సిటీ పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్ టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్సీ) సౌజన్యంతో తొలి దశలో 50 అవెంజర్ వాహనాలను ఖరీదు చేసి, వీటికి అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేశారు. వీటిని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం
ఆవిష్కరించారు.
వాహనాల హంగులిలా..
ఎనిమిది గంటల పాటు నిర్వరామంగా సంచరించినా చోదకుడు అలసిపోకుండా ఉండేందుకు బజాజ్ కంపెనీకి చెందిన తెలుపు రంగు అవెంజర్ 220 క్రూయిజ్ వాహనాన్ని ఎంపిక చేశారు. వీటిపై హెచ్‌సీఎస్సీ, సిటీ, ట్రాఫిక్ పోలీసు లోగోలు ముద్రించారు. ఈ వాహనం నిర్వహణ టాస్‌్కఫోర్స్ సిబ్బంది బాధ్యత. దశలవారీగా మరో 100 వాహనాలు కొనుగోలు చేయనున్నారు. జంక్షన్ల మధ్య జామ్స్ లేకుండా చూడటం, అక్రమ పార్కింగ్, క్యారేజ్ వే ఆక్రమణలు తొలగించడం, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడం, బ్రేక్ డౌన్ అయిన వాహనాల గుర్తింపు ఈ టాస్‌్కఫోర్స్ విధులు. బ్రేక్ డౌన్ అయిన భారీ వాహనాలు తొలగింపునకు మూడు అత్యాధునిక క్రేన్లు సమీకరించుకున్నారు.
నంబర్ల వారీగా ఇలా..
1పబ్లిక్ అడ్రస్ సిస్టం: ఈ వాహనానికి ముందు భాగంలో రెండు మైకులు ఉంటాయి. వీటిలో ఒకటి సైరన్ కాగా.. మరొకటి పబ్లిక్ అడ్రస్ సిస్టం.
2 కాలర్ మైక్రోఫోన్: దీనిపై సంచరించే సిబ్బంది ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ప్రకటన చేయడానికి ఆగాల్సిన అవసరం లేదు. దీనికి అనుసంధానించి ఉండే కాలర్ మైక్రోఫోన్‌ను చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా వాడవచ్చు.
3 వాకీటాకీకి మైక్రోఫోన్: క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసులు సమాచార మారి్పడికి వాకీటాకీ అనివార్యం. వాహచోదకుడు తన వాకీటాకీనీ చేత్తో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా మైక్రోఫోన్ సౌకర్యం ఉంది.
4 డ్యాష్‌బోర్డ్ కెమెరా: ఈ వాహనాన్ని నడిపే ట్రాఫిక్ టాస్‌్కఫోర్స్ సిబ్బంది దారిలో కనిపించిన ఉల్లంఘనల్ని ఫొటో తీయడానికి చేతిలో ఉండే కెమెరాలు అవసరం లేదు. వాహనం హ్యాండిల్ పైన ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ కెమెరా ఏర్పాటు చేశారు. ఇది తీసిన ఫొటోలు నేరుగా కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఈ–చలాన్ జారీ అవుతుంది.
5 జీపీఎస్ ట్రాకింగ్: ట్రాఫిక్ టాస్‌్కఫోర్స్ వాహనాలను అవసరాన్ని బట్టి ఏ ప్రాంతానికైనా మోహరిస్తారు. దీనికోసం అవి ఎక్కడ ఉన్నాయో కంట్రోల్ రూమ్ సిబ్బంది తెలుసుకోవడానికి జీపీఎస్ పరిజ్ఞానంతో పని చేసే ట్రాకింగ్ డివైజ్ ఉంది.
6 ఫస్ట్ ఎయిడ్ కిట్: అత్యవసర సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్, అందులోనే కమ్యూనికేషన్ కోసం ట్యాబ్ ఉంటుంది.
7 ట్రాఫిక్ ఎక్యూప్‌మెంట్ బాక్స్: వర్షం కురిసినప్పుడు అసరమైన చోట విధులు నిర్వర్తించడానికి రెయిన్ కోట్, షూస్‌తో పాటు రిఫ్లెక్టివ్ జాకెట్ ఉండే పెట్టె ఉంది.
8 బాడీ వార్న్ కెమెరా: టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంచరించే మార్గాలు, అక్కడి పరిస్థితులతో పాటు ప్రజలతో నడుచుకునే తీరు పరిశీలించడానికి బాడీ వార్న్ కెమెరా ఉంది. ఇది నేరుగా కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ దీని ఫీడ్ మొత్తం రికార్డు అవుతుంది.
9యుటిలిటీ బాక్స్: రెస్క్యూ సమయంలో వాహన చోదకుడు తన హెల్మెట్, సెల్‌ఫోన్‌తో పాటు ఇతర పరికరాలు భద్రపరుచుకోవడానికి ఈ బాక్స్ ఉపకరిస్తుంది.