
సీఎం రేవంత్‌రెడ్డితో ‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల’ కీలక భేటీ
అదనపు అడ్వకేట్ జనరల్‌తో కలిసి గంటకు పైగా చర్చ
సుప్రీంకోర్టు డెడ్‌లైన్, స్పీకర్ నోటీసులు, బీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత
నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించామని బయటకు చెబుతున్న ఎమ్మెల్యేలు
కానీ తాము పార్టీ మారలేదంటూ స్పీకర్‌కు సమాధానం ఇవ్వాలని భేటీలో నిర్ణయం?
భవిష్యత్ వ్యూహం, స్పీకర్‌కు ఏం జవాబు చెప్పాలో నిర్ధారించుకునేందుకే అంటున్న రాజకీయ వర్గాలు
అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా!
కడియం శ్రీహరి మినహా 9 మంది హాజరు
భట్టి విక్రమార్క, పొంగులేటి,శ్రీధర్‌బాబు, మహేశ్‌గౌడ్ కూడా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులు కూడా హాజరు కావడం విశేషం.
వీరి అనర్హత విషయంలో సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించడం, సుప్రీం ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపుపై జవాబు చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసుల గడువు ముగుస్తుండడం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి తమకు పాత కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యల పరిష్కారం పైనే చర్చించామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు బయటకు చెబుతున్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ జారీ చేసిన నోటీసుల విషయంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చెప్పాలి అనేది నిర్ణయించేందుకే ఈ భేటీ జరిగిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
సమావేశంలో ఏఏజీ..!
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. కాగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మహీపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికపూడి గాం«దీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకటరావు, కాలె యాదయ్యలు పాల్గొన్నారు.
మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ భేటీలో ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు, స్పీకర్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరిగింది. దీంతో పాటు ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది.
అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం.. తాము పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్ లోనే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిసామనే రీతిలో సమాధానమివ్వాలనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని, పార్టీని, తనను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోమని భరోసా ఇచ్చినట్టు తెలిసింది.
నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులకు వీలున్నంత మేర నిధులు మంజూరు చేస్తామని, నియోజకవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు పాత కాంగ్రెస్ నాయకత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కోర్టు కేసుల విషయంలో కూడా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం.
గతంలోనే కలవాలనుకున్నాం..
సమావేశం అనంతరం ఓ ఎమ్మెల్యే ’సాక్షి’తో మాట్లాడుతూ.. అందరం కలిసి సీఎంతో సమావేశం అవుదామని గతంలోనే నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ మేరకే ఆయన్ను కలిశామని, అనేక అంశాలపై చర్చించామని, సీఎం కూడా తమకు భరోసా ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.