
షర్మిలపై వైఎస్ జగన్ కేసులో ఎన్‌సీఎల్‌టీ స్పష్టీకరణ
పాత షేర్ హోల్డింగ్‌ను పునరుద్ధరించాలంటూ కంపెనీకి ఆదేశాలు
వైఎస్ జగన్, వైఎస్ భారతి, క్లాసిక్ రియాల్టీ షేర్లూ పునరుద్ధరించాలి
షేర్ల బదిలీకి పాటించాల్సిన నిబంధనలేవీ పాటించలేదు
చెల్లెలికి ఆ కంపెనీలో షేర్లన్నీ ఇవ్వాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం
ఆ ఉద్దేశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ ఎంఓయూ, గిఫ్ట్ డీడ్
కేసులు తేలాకే ఆస్తులు బదలాయించాలని గిఫ్ట్ డీడ్‌ను పూర్తిచేయలేదు
అందుకే ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ పత్రాలు ఇవ్వలేదు.. అవి పోయాయని చెప్పి ప్రతివాదులు డూప్లికేట్ సర్టిఫికెట్లు తీసుకున్నారు
పిటిషనర్లకు తెలియకుండా అలా చేయటం అక్రమం; సరికాదు.. అందుకే గత జూలై 2 నాటి సరస్వతి బోర్డు తీర్మానాన్ని రద్దు చేస్తున్నాం
వాటాల బదిలీ కూడా రద్దు.. పిటిషనర్ల పేర్లు కంపెనీ బోర్డు రిజిస్టర్‌లో చేర్చాలి
ఆ విషయాన్ని కంపెనీల రిజిస్ట్రార్ కు తెలియజేయాలి: ఎన్‌సీఎల్‌టీ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి, క్లాసిక్ రియాల్టీలకున్న వాటాను తక్షణం పునరుద్ధరించాలని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు తల్లి విజయమ్మ ద్వారా తన సోదరి షర్మిల చేసుకున్న అక్రమ బదిలీని నిలిపివేయాలని ఆయన చేసిన వాదనతో బెంచ్ ఏకీభవించింది. వారి వాటాలను వారి పేరుపై మార్చి, వాటాదారులుగా పేర్కొంటూ సభ్యుల రిజిస్టర్‌ను సరిదిద్దాలని సరస్వతి పవర్ బోర్డుకు స్పష్టం చేసింది. ఆ విషయాన్ని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువరించిన బెంచ్... బుధవారం 45 పేజీల తీర్పు కాపీని వెలువరించింది.
తీర్పులో ముఖ్యాంశాలివీ...
∙పిటిషనర్లయిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి, క్లాసిక్ రియాల్టీల నుంచి ప్రతివాదులు అక్రమ పద్ధతుల్లో షేర్లను బదిలీ చేసుకున్నారు. ఎందుకంటే పిటిషనర్లు తమ పేరిట ఉన్న షేర్లకు సంబంధించి ఎలాంటి షేర్ ట్రాన్స్‌ఫర్ ఫారాలపైనా (ఎస్‌హెచ్–4) సంతకాలు చేయలేదు. చెల్లెలిపై ఉన్న ప్రేమాభిమానాలతో అంతిమంగా చెల్లెలికి చెందేలా తల్లిని ట్రస్టీగా పెట్టి పిటిషనర్లు తమ షేర్లను గిఫ్ట్ డీడ్ చేశారు. కానీ కోర్టుల్లో కేసులు తేలాకే ఇవ్వాలనే షరతు పెట్టుకున్నారు కనక దానికి తగ్గట్టుగా ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లను తమ వద్దే ఉంచుకున్నారు.
» షేర్ బదిలీ ప్రక్రియ కోసం తప్పనిసరిగా పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. ఎస్‌హెచ్–4 బదిలీ ఫారాన్ని షేర్ హోల్డర్ల సంతకాలతో, తగిన స్టాంప్ డ్యూటీ చెల్లించి సమర్పించాలి. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లూ ఉండాలి. కానీ ఇక్కడ ప్రతివాదులు అవేమీ పాటించలేదు.
» ‘డాక్యుమెంట్లు పోయాయి’ అని ప్రతివాదులు చెప్పిన కారణం చట్టపరంగా సరైనది కాదు. ఒకవేళ అదే నిజమైతే పోయినట్లు పోలీస్ కంప్లయింట్ ఉండాలి. దాని ఆధారంగానే డూప్లికేట్ సర్టిఫికెట్లు పొందే ప్రయత్నం చేయాలి. దీనికి ఒరిజినల్ షేర్ హోల్డర్లూ సహకరించాలి. ఒరిజినల్ షేర్ హోల్డర్ల నుంచి అలాంటివేమీ లేకుండా... బోర్డు తీర్మానం ఆధారంగా షేర్లను పొందినట్లు చూపించడం న్యాయసమ్మతం కాదని బెంచ్ అభిప్రాయపడింది.
» గిఫ్డ్ డీడ్‌లు, షేర్ల కొనుగోలు ఒప్పందాలు (ఎస్‌పీఏ) ఉన్నా... అవి అంతర్గతంగా చేసుకున్న వ్యక్తిగత ఒప్పందాలు మాత్రమేనని, వాటి ఆధారంగా కంపెనీ రిజిస్టరులో పేరు మార్పు జరగాలంటే కంపెనీల చట్టం నిర్దేశిస్తున్న ప్రక్రియను పాటించాలని స్పష్టంచేసింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 56 (1) ప్రకారం షేర్ ట్రాన్సఫర్ చట్టబద్ధంగా జరగాలంటే ఎస్‌హెచ్–4, ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు, స్టాంప్ డ్యూటీ చెల్లించిన రసీదు తప్పనిసరి అని... ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లకు ఎలాంటి మినహాయింపూ ఉండదని స్పష్టంచేసింది.
» ప్రతివాదులు ఇండెమ్నిటీ బాండ్లు, అఫిడవిట్లు మాత్రమే సమర్పించారని, అవి సరిపోవని తేల్చిచెప్పింది.