ఇంటర్‌ సీట్లకు పెరిగిన డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సీట్లకు పెరిగిన డిమాండ్‌

May 12 2023 8:44 AM | Updated on May 12 2023 9:35 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: టెన్త్‌ ఫలితాలు వెల్లడితో కార్పొరేట్‌ కళాశాలల సీట్లకు డిమాండ్‌ పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు దృష్ట్యా ప్రదర్శిస్తున్న ఆసక్తి విద్యా సంస్థలకు కాసులు కురిపిస్తోంది. ఇప్పటికే అడ్మిషన్లు ఫుల్‌ ఒకటి, రెండ్లు సీట్లు మాత్రమే ఉన్నాయంటూ ఇష్టానుసారం ఫీజుల మోతను మోగిస్తున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచేసిన విద్యా సంస్థలు తాజాగా సీట్లకు పెరిగిన డిమాండ్‌తో మరింత పెంచి ఎలాంటి తగ్గింపు లేకుండా వసూళ్లు దిగాయి. పేరొందిన కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ డే స్కాలర్‌కు కనీసం రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు చెబుతున్నారు. హాస్టల్‌ సౌకర్యమైతే దీనికి రెండింతలు అధికంగా ఫీజు. ఒకే కార్పొరేట్‌ విద్యా సంస్థకు చెందిన వివిధ బ్రాంచ్‌లలో ఫీజులు ఒక్కో విధంగా ఉంటున్నాయి. మొన్నటి దాకా అధికారికంగా ఫీజుల స్ట్రక్చర్‌ ప్రదర్శించి కోర్సుల వారీగా.. ముందస్తు అడ్మిషన్‌లైతే డిస్కౌంట్‌ (లాక్‌ ఫీ) ఉంటుందని పేర్కొనగా, తాజాగా సీట్లకు డిమాండ్‌ పెరగడంతో డిస్కౌంట్‌ లేకుండా పూర్తి ఫీజు అంగీకరిస్తేనే సీటు అని తెగేసి చెబుతున్నాయి. మరోవైపు సీటు రిజర్వేషన్‌ కోసం రూ.10,500 చెల్లించక తప్పడం లేదు.

పెను భారంగా..
ప్రైవేటు కార్పొరేట్‌ కాలేజీలు ఫీజుల దోపిడీతో తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. మూడేళ్ల క్రితం కరోనా సమయం 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో పాత ఫీజులే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో చాలా వరకు విద్యా సంస్థలు దానిని అమలు చేశాయి. పైగా ఆన్‌లైన్‌ క్లాసులు జరగడం వల్ల మెయింటెనెన్స్‌ భారం తగ్గడంతో పాత ఫీజులు తీసుకున్నాయి. ఆ తర్వాత నుంచి ప్రభుత్వ ఆదేశాలు లేకపోవడంతో మళ్లీ ఫీజులు పెంచడం ప్రారంభించాయి. గత విద్యా సంవత్సరంలోనే భారీగా ఫీజులు పెంచిన యాజమాన్యాలు ఈసారి మరో 20 శాతం పెంచేశాయి.

అమలుకు నోచుకోని నివేదిక..
ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై నియంత్రణ లేకుండా పోయింది. ఫీజుల నియంత్రణపై 2017 డిసెంబర్‌లో ఆచార్య తిరుపతి రావు కమిటీ ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అంది అయిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ కమిటీ సిఫారసులు అమలుకు నోచుకోలేకపోయాయి. మరోవైపు ఫీజుల రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకురావాలని గతేడాది మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినా ఫలితం లేకుండా పోయింది. వాస్తవంగా ఈ చట్టం తయారు చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. తర్వాత ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ప్రతి విద్యా సంవత్సరం పాత ఫీజులకంటే పది శాతం కంటే ఎక్కువ ఫీజులు పెంచకూడదని సూచించింది. విద్యా సంస్థల్ని నియంత్రించేలా ఇతర సూచనలను చేస్తూ సూచనలు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఫీజులపై నియంత్రణా లేకపోవడంతో విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement