ఆరోగ్యం కోసం మనం అనేక హెల్త్ సప్లిమెంట్లు, వ్యాయామం, వివిధ ఆరోగ్య సలహాలపై ఎంతో శ్రద్ధ పెడుతుంటాం. కానీ మనిషికి అత్యంత ప్రాథమిక అవసరాల్లో ఒకటైన ఆప్యాయత, అనుబంధం గురించి మాత్రం కొన్నిసార్లు మర్చిపోతుంటాం. ఈ ఆప్యాయత అనుబంధాలను వ్యక్తపరిచే ఆలింగనం ఆరోగ్యకర జీవితానికి చాలా కీలకమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మనిషిని మనిషికి దగ్గరగా చేసే భావోద్వేగ వ్యక్తీకరణ అయిన ఆలింగనంలో అపరిమితమైన శక్తి దాగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాసేపు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం లేదా కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందంటున్నారు.
ప్రేమపూర్వకంగా తాకడం, ఆప్యాయంగా హత్తుకోవడం అనే ప్రక్రియ శరీరం ఒత్తిడికి స్పందించే తీరును మార్చగలదని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి కలిగే పరిస్థితి తర్వాత ఓ కౌగిలింత లేదా ఓ ఆత్మీయ స్పర్శ వల్ల దేహంలో విడుదలయ్యే కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) మోతాదులు తగ్గుతాయని.. ఫలితంగా ఒత్తిడి కూడా తగ్గుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గత రెండేళ్లుగా దాదాపు 137 అధ్యయన ఫలితాలను విశ్లేషించిన మెటా–అనాలిసిస్‌లో ఆప్యాయకర శారీరక స్పర్శ కలిగే ప్రయోజనాలు ఒత్తిడి తగ్గించడమే కాకుండా నొప్పి, ఆందోళన, డిప్రెషన్ లక్షణాల వంటివి కూడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. అందుకే మన మనసుకు నచ్చిన వ్యక్తిని కాస్త దగ్గరగా హత్తుకోవడం ద్వారా అతడికీ, మనకూ పైసా ఖర్చులేకుండా ఆరోగ్యం సమకూరితే అంతకంటే కావాల్సిందేముంటుంది అంటున్నారు పరిశోధకులు.
స్క్రీన్‌లకు అతుక్కుపోయే యువతలో డిప్రెషన్ !
రోజూ గంటల తరబడి స్క్రీన్‌లను చూడటం యువత మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ దురలవాటు యువతలో డిప్రెషన్, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యల ముప్పును రెట్టింపు చేయవచ్చని ఓ కొత్త పరిశోధన సూచిస్తోంది. దాదాపు 90 లక్షల మందికిపైగా వ్యక్తుల సమాచారాన్ని విశ్లేషించిన ఈ అధ్యయనంలో టీవీ, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్‌లను ఎక్కువ సేపు చూసే వారిలో తమను తాము గాయపరుచుకునే ధోరణి, ప్రవర్తనా సమస్యలు, నిద్ర సమస్యలు కూడా ఎక్కువగా కనిపించినట్లు తేలింది.
అయితే కేవలం స్క్రీన్‌లను ఎక్కువగా ఉపయోగించడమే ఈ సమస్యలకు కారణమని ఈ అధ్యయనం నిరూపించనప్పటికీ స్క్రీన్ టైమ్‌కు, మానసిక సమస్యలకు మధ్య సంబంధం కనిపిస్తుండటంతో ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు డిజిటల్ ఉత్పత్తులపై మరింత నియంత్రణపూర్వకమైన ధోరణిని అనుసరించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు సూచిస్తున్నారు. యువతను ఈ ముప్పు నుంచి రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక అంతర్జాతీయ ఒప్పందం అవసరమన్నది కూడా వారి అభిప్రాయం.
ఇష్టమైన సంగీతంతో నొప్పుల తగ్గుదల?
ఎమ్మారై స్కాన్ కోసం సూది గుచ్చినప్పుడు కలిగే నొప్పిని ఇష్టమైన సంగీతం వినడం తగ్గించవచ్చని ఒక అధ్యయనం సూచిస్తోంది. అయితే ఏదైనా ఒక ఆరోగ్య సమస్యకు ఏ రకమైన సంగీతం ఎక్కువగా ఉపయోగపడుతుందనే విషయంలో పరిశోధకుల మధ్య ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మారై స్కాన్ సమయంలో రక్తనాళంలోకి సూది (ఇంట్రావీనస్ కాన్యులేషన్) గుచ్చేటప్పుడు కలిగే నొప్పిపై సంగీతం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోడానికి పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు.
వైద్య ప్రక్రియల సమయంలో నొప్పిని తగ్గించేందుకు రోగికి ఇష్టమైన సంగీతాన్ని వినిపించడం కొంత వరకు ఒక సరళమైన, ఉపయోగకరమైన మార్గం కావచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా వాలంటీర్లను నాలుగు బృందాలుగా విభజించారు. మొదటి బృందానికి మొజార్ట్ సంగీతాన్ని, రెండో టీమ్‌కు వారు ఇష్టపడే సంగీతాన్ని, మూడో బృందానికి వాళ్ల మనసుకు ప్రశాంతత కలిగించే సంగీతాన్ని వినిపించారు. నాలుగో బృందానికి ఎలాంటి సంగీతాన్నీ వినిపించలేదు. సూది గుచ్చాక ఆ నాలుగు బృందాల వారికి ఎంత నొప్పి కలిగిందో నమోదు చేశారు.
ఇందుకోసం విజువల్ అనలాగ్ స్కేల్ అనే పద్ధతిని ఉపయోగించారు. ఇందులో వ్యక్తులు తమకు కలిగిన నొప్పి తీవ్రతను ఒక స్కేల్‌పై తెలియజేస్తారు. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... తాము ఇష్టపడే సంగీతాన్ని విన్నవారిలో సూది గుచ్చిన 30 సెకన్ల నుంచి రెండు నిమిషాల తర్వాత నొప్పి గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. మొజార్ట్ సంగీతం విన్నవారిలోనూ నొప్పి తగ్గుదల కనిపించింది. వైద్య ప్రక్రియల సమయంలో సంగీతం నొప్పిని తగ్గించడంలో కొంత వరకు ఉపయోగపడవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.


