న్యూస్‌రీల్
తెర వెనుక ఏం జరుగుతోంది
● మంత్రుల పర్యటనలు, ఢిల్లీ ధర్నాకు గైర్హాజరు
● ఇటీవల కేటీఆర్‌కు తూర్పు ఎమ్మెల్యే సురేఖ క్షమాపణ
● కేబినెట్ నుంచి బర్తరఫ్ తర్వాత మారిన రాజకీయ వైఖరి
● తాజా పరిణామాలతో రాజకీయవర్గాల్లో కొత్త చర్చ
సాక్షి ప్రతినిధి, వరంగల్:
కాంగ్రెస్‌లో ఉంటూనే ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా.. ప్రత్యర్థి పార్టీ నేతకు క్షమాపణ చెబుతూ మరోవైపు మౌనం.. మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు దంపతుల తాజా రాజకీయ వైఖరి ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో గతంలో మాదిరిగా చురుగ్గా కనిపించకపోవడం.. ఢిల్లీలో నిర్వహించిన ‘ఓటు బచావో–దేశ్ బచావో’ నినాదంతో చేసిన ధర్నాకు సైతం దూరంగా ఉండడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి తోడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు చెప్పడం కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. కేబినెట్ నుంచి బర్తరఫ్‌కు గురైన తర్వాత కొండా దంపతులు అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? పార్టీపై అసంతప్తి వ్యక్తం చేస్తున్నారా? లేక భవిష్యత్ రాజకీయ అడుగుల కోసం వేచి చూస్తున్నారా? అన్న చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా..
కేబినెట్ నుంచి తొలగింపునకు గురైన అనంతరం కొండా సురేఖ వ్యవహారశైలిలో మార్పు కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన ఇండియా కూటమి ర్యాలీకి సైతం హాజరుకాకపోవడం చర్చకు దారితీసింది. సుమారు 10 రోజుల కిందట వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన, కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క హాజరైనప్పటికీ.. నగరంలోనే ఉన్న కొండా సురేఖ దూరంగా ఉండడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వ అధి కారిక కార్యక్రమాలు, మంత్రుల పర్యటనలు, సమీక్షలకు వరుసగా దూరంగా ఉండడం వెనుక అసంతృప్తి ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేబినెట్ నుంచి తొలగింపు, రాష్ట్ర నాయకత్వంతో విభేదాలు, తాజా గైర్హాజరు కలిపి చూస్తే కాంగ్రెస్‌లో కొండా దంపతుల రాజకీయ భవిష్యత్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కార్యక్రమాలకు దూరంగా ఉన్నంత మాత్రాన పార్టీని వీడతారని నిర్ధారించలేం. కానీ, వారి తదుపరి అడుగులపై మాత్రం ఆసక్తి నెలకొంది.
రెండేళ్ల తర్వాత కేటీఆర్‌కు క్షమాపణెందుకు?
2024 అక్టోబర్‌లో అప్పటి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సినీనటులు నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్‌ను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయ, సినీ రంగాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై కేటీఆర్ పరువునష్టం కేసు వేయగా, నటుడు నాగార్జున కూడా న్యాయపరమైన చర్యలు చేపట్టారు. నాగార్జున కుటుంబానికి సంబంధించిన కేసు 2025 నవంబర్‌లో ఉపసంహరణకు వచ్చినప్పటికీ, కేటీఆర్ దాఖలు చేసిన కేసు కొనసాగింది. ఈనేపథ్యంలో అక్టోబర్ 29న ‘ఎక్స్’ వేదికగా కొండా సురేఖ తన గత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అలా మాట్లాడానని, కొన్ని నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని తెలిపారు. గత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కేబినెట్ నుంచి తొలగింపునకు గురైన కొద్ది వారాలకే.. గతంలో చేసిన వ్యాఖ్యలపై దాదాపు రెండేళ్ల తర్వాత స్పందించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయపరమైన కేసు నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమా? లేక మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో తన వైఖరిని మార్చుకుంటున్నారా? అన్న చర్చ జరుగుతోంది.
ఒకప్పుడు బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కొండా సురేఖ.. ఇప్పుడు కేటీఆర్ విషయంలో విచారం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌తో మళ్లీ సన్నిహితమవుతారా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పడాన్ని పార్టీ మార్పునకు సంకేతంగా భావించలేమని, అయితే కాంగ్రెస్ నాయకత్వంతో తమకు ఎదురవుతున్న పరిస్థితులపై అధిష్టానంతో ఏదైనా స్పష్టత కోరుతున్నారా? ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను పరిశీలిస్తున్నారా? అనే అంశాలపై కొండా దంపతులు అధికారికంగా ప్రకటిస్తేనే స్పష్టత వస్తుందన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది.


