తరలొచ్చిన సర్కారు.. మురిసిన మేడారం
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంక్రీట్ జంగిల్‌లో నుంచి రాష్ట్ర సర్కారు పచ్చని వనానికి చేరుకుంది. కంచు గజ్జల సవ్వడితో.. కొమ్ము బూరల నాదంతో.. జంపన్న వాగు అలల సాక్షిగా.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల బృందం, అధికార గణానికి గిరిజనులు ఆత్మీయ స్వాగతం పలకగా, వనసిరి వెలుగుల్లో.. మారిన నవ మేడారం ముఖచిత్రం చూసి అందరూ అబ్బురపోయారు. సాయంత్రం నుంచి వనంనుంచి రాష్ట్ర పాలన సాగించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వమంతా తరలిరావడంతో మేడారం ఆదివారం పోలీసులమయమైంది. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న కీకారణ్యంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సాహసోపేతమైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం మేడారంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రి వర్గ సభ్యులు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీలు, డీజీపీలు, సీనియర్ ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు అందరూ ఆదివారం సాయంత్రం మేడారం చేరుకున్నారు. రూ.251 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు, శిలలతో సాలాహారాలు, ద్వార బంధాలు, గద్దెల సుందరీకరణ పనులను ప్రత్యేకంగా పరిశీలించేందుకు మంత్రులు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. సమ్మక్క–సారలమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేసుకుని రెండు రోజుల పాటు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో జరిగే మేడారం జాతర ఈసారి ప్రత్యేకంగా ఉండాలని మంత్రి సీతక్క పట్టుబట్టడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పనులు వేగంగా జరిగేలా సీఎం చర్యలు తీసుకున్నారు. ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం, మొక్కుల సమర్పణతోపాటు మంత్రి వర్గ సమావేశానికి సైతం కార్యాచరణకు శ్రీకారం జరిగింది.
పోలీసుల వలయంలో మేడారం
మేడారం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబ ల్యం తగ్గినప్పటికీ సీఎం, మంత్రుల బస నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా పికెట్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఏఎన్‌పీఆర్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులముందు నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి మేడారంలో పర్యటించి ఐపీఎస్ అధికారులతో సమన్వయం చేశారు. ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్‌కేకన్ అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు అతిథుల కోసం మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. 10 మంది ఐపీఎస్ అధికారులు, 1,600 పోలీసు అధికారులు, సిబ్బంది మేడారంలో బందోబస్తు నిర్వహించారు.
మంత్రులు మాత్రమే..
మేడారంలోని హరిత హోటల్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి కేవలం మంత్రులు, మంత్రి వర్గ సమావేశ ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే అనుమతించారు. చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీని కూడా అనుమతించారు. సాయంత్రం 4 గంటల నుంచి హరిత హోటల్ ముఖ ద్వారం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి, మంత్రులు మినహా మిగతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అనుమతించలేదు. మంత్రివర్గ సమావేశం అనంతరం సమావేశం నిర్ణయాలను ప్రకటించేలా మీడియా బ్రీఫింగ్ భేటీకి మాత్రం హైదరాబాద్ సమాచార పౌర సంబంధాలశాఖ తయారు చేసిన జాబితా లోని అక్రిడేటెడ్ జర్నలిస్టులను అనుమతించారు. కాగా, మొదట ఆదివారం సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు సుమారు గంటపాటు మంత్రివర్గ సమావేశం ఉంటుందని సీఎం టూర్ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. అయితే, ఖమ్మం జిల్లా పాలేరులో కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి 5:30 గంటలకు మేడారం చేరుకోవడం వల్ల సుమారు గంట ఆలస్యంగా కేబినెట్ సమావేశం మొదలైంది. ఈసమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం
సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత
హరిత హోటల్‌లో పలు అంశాలపై చర్చ
కేబినెట్ భేటీకి మంత్రులకు మాత్రమే అనుమతి
మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులపై
కీలక నిర్ణయాలు


