ఏడేళ్లుగా ఎదురుచూపులు | - | Sakshi
Sakshi News home page

ఏడేళ్లుగా ఎదురుచూపులు

Jan 19 2026 4:04 AM | Updated on Jan 19 2026 4:04 AM

ఏడేళ్లుగా ఎదురుచూపులు

ఏడేళ్లుగా ఎదురుచూపులు

ఏడేళ్లుగా ఎదురుచూపులు

హన్మకొండ: అక్రమాలకు పాల్పడింది ఒకరైతే.. శిక్ష మరికొందరు అనుభవిస్తున్నారు. ప్రతిభతో ఉద్యోగాలకు ఎంపికై నా.. నియామకాల్లో జరిగిన అక్రమాలతో వారు ఉద్యోగాలకు దూరమయ్యారు. 497 సబ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి టీజీ ఎన్పీడీసీఎల్‌ 2018 మే 24న నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే ఏడాది జూలై 8న రాత పరీక్ష నిర్వహించి ఆగస్టు 31న ఫలితాలు ప్రకటించింది. పోస్టుకు ఒకరు చొప్పున మెరిట్‌ ఆధారంగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సెప్టెంబర్‌లో పూర్వ సర్కిల్‌ వారీగా వేర్వేరు తేదీల్లో అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపింది. 497 మందికి కాకుండా 427 మందికి మాత్రమే కాల్‌ లెటర్లు పంపారు. అంటే ఇక్కడ 70 పోస్టులు తగ్గించారు. అదే సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ నిలిపివేశారు. ఎన్నిక కోడ్‌ ఎత్తివేశాక 2018 డిసెంబర్‌లో మరోసారి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్‌ లెటర్లు పంపారు. అయితే ఈ సమయంలో మరో 24 పోస్టులు తగ్గించారు. గతంలో కాల్‌లెటర్లు అందుకుని రెండోసారి కాల్‌లెటర్లు అందని అభ్యర్థులు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు కాల్‌లెటర్లు పంపిన వారందరికీ తిరిగి పంపించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అధికారులు అనర్హులతో కలిపి 427 మందికి కాల్‌లెటర్లు పంపి పోస్టులు భర్తీ చేశారు. అయితే కోర్టు ఆదేశాలతో కాల్‌ లెటర్లు పొందిన 24 మంది అభ్యర్థులను పక్కన పెట్టారు. ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాపాలనలో వీరు ఫిర్యాదు చేశారు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం విచారణ చేపట్టింది. టీజీ పీఎస్‌సీ నుంచి ఒక అధికారి, ఎస్పీడీసీఎల్‌ నుంచి ఇద్దరు, ఎన్పీడీసీఎల్‌ నుంచి ఇద్దరు అధికారుల కమిటీ విచారణ జరిపింది. 24 పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి యాజమాన్యానికి నివేదిక అందించింది. ఈ నివేదిక మేరకు అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారికి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి ఎందుకు తొలగించకూడదు అంటూ నోటీసులు జారీ చేయగా వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అన్యాయం జరిగిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటి వరకు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ కార్యాలయం

చుట్టూ ప్రదక్షిణ..

అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం చోద్యం చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలకవర్గంలో కీలక వ్యక్తి అక్రమాలకు పాల్పడితే చర్యలుండవా అని ప్రశ్నిస్తున్నారు. అర్హులై ఉండి ఉద్యోగాలు రాని అభ్యర్థులు టీజీ ఎన్పీడీసీఎల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరో వైపు వయోభారం ముంచుకొస్తోంది, వచ్చిన అవకాశం చేజారిపోయినట్లేనా అని రోదిస్తున్నారు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిలో కొందరు రిజైన్‌ చేసి వెళ్లిపోయారని, వారి స్థానాల్లోనైనా 24 మందిలో కొందరికై నా ఉద్యోగాలు కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

సబ్‌ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు

24 మంది అభ్యర్థులకు రాని ఉద్యోగాలు

బాధ్యులపై చర్యలు తీసుకోని టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement