అప్పుడలా.. ఇప్పుడిలా!
సాక్షిప్రతినిధి, వరంగల్:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సహా 12 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గత ఎన్నికల్లో బీసీ మహిళకు కేటాయించిన జీడబ్ల్యూఎంసీ పీఠం ఈసారి జనరల్‌కు దక్కనుంది. పాత 9 మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పాటైన ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, కేసముద్రంకు కూడా రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని శనివారం రిజర్వేషన్లు వెల్లడించారు. మున్సిపాలిటీల విషయానికి వస్తే ఒక్క నర్సంపేట మినహా అన్నింట్లో రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మారాయి. అయితే పాలకవర్గాల పదవీకాలం ముగిసిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకే ఈసారి ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు జూన్‌లో జరగనుండగా.. 12 మున్సిపాలిటీలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వేషషన్లు వెలువడిన కారణంగా 12 మున్సిపాలిటీల్లో ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రిజర్వేషన్లతో కొందరి ఆశలు గల్లంతు..
మున్సిపాలిటీల రిజర్వేషన్లు వెల్లడి కావడంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆశావహుల ఆశలు గల్లంతయ్యాయి. గతంలో పరకాల ఎస్సీ మహిళకు కేటాయించగా ఈసారి జనరల్‌కు దక్కింది. వర్ధన్నపేటలో గతంలో ఎస్టీ మహిళకు కాగా, ఈసారి జనరల్‌కు, జనగామలో జనరల్ మహిళ నుంచి బీసీ జనరల్, మహబూబాబాద్‌లో జనరల్ అన్ రిజర్వుడ్ నుంచి ఎస్టీ మహిళ, డోర్నకల్ ఎస్టీ అన్ రిజర్వుడ్ నుంచి ఎస్సీ జనరల్, మరిపెడ ఎస్టీ మహిళ నుంచి జనరల్ మహిళ, తొర్రూరు ఎస్సీ అన్ రిజర్వుడ్ నుంచి జనరల్, భూపాలపల్లి ఎస్సీ మహిళ నుంచి బీసీ జనరల్‌కు రిజర్వేషన్లు మారాయి. కొత్త మున్సిపాలిటీలు స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ జనరల్, కేసముద్రం ఎస్సీ మహిళ, ములుగు బీసీ మహిళకు కేటాయించారు.
‘గ్రేటర్’లో
మేయర్ల ప్రస్థానం ఇలా..
వరంగల్.. మున్సిపాలిటీ నుంచి 1994 సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్‌గా, 2015లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. 1995 నుంచి జరిగిన ఎన్నికల్లో బీసీ మహిళ నుంచి మొదలైన రిజర్వేషన్ ఈసారి జనరల్‌కు కేటాయించారు. ఆయా దశల్లో మేయర్ల ప్రస్థాన ఇలా ఉంది.
● 1995లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయింది. కాంగ్రెస్ నుంచి కాకుమాను పద్మావతి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా మేయర్‌గా గెలుపొందారు.
● 2000లో మేయర్ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించారు. తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షాల తరఫున బీజేపీకి చెందిన డాక్టర్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు మేయర్‌గా గెలిచారు.
● 2005లో మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. పరోక్ష విధానంలో కాంగ్రెస్ నుంచి ఎర్రబెల్లి స్వర్ణ మేయర్ పదవిని అలంకరించారు.
● పదేళ్లపాటు ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది.
గ్రేటర్ వరంగల్ మేయర్ల ప్రస్థానం..
● 2016 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మేయర్ స్థానం జనరల్‌గా మారింది. అప్పటి 19వ డివిజన్ కార్పొరేటర్ నన్నపునేని నరేందర్ మేయర్‌గా ఎన్నికయ్యారు. రెండున్నర ఏళ్లపాటు మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన 2019లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజొద్దీన్ ఇన్‌చార్జ్ మేయర్‌గా మూడు నెలల పాటు పనిచేశారు. తదుపరి 2019 మే లో మేయర్‌గా 26వ డివిజన్ కార్పొరేటర్ గుండా ప్రకాశ్‌రావు ఎన్నికయ్యారు. పాలక వర్గం పదవి కాలం ముగిసిన తర్వాత 58 నుంచి 66 డివిజన్లకు ప్రభుత్వం పెంచింది.
● 2021 మార్చిలో గ్రేటర్ వరంగల్ పీఠాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. మేయర్‌గా బీసీ మహిళ గుండు సుధారాణి ఐదేళ్లపాటు కొనసాగుతున్నారు.
● 2026లో జరగనున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల కోసం మేయర్ పదవి జనరల్ స్థానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పదవి కోసం అన్ని వర్గాలకు చెందిన పలువురు నాయకుల నుంచి విపరీతంగా పోటీ ఉంది.
జీడబ్ల్యూఎంసీ, మున్సిపాలిటీల రిజర్వేషన్లలో ‘రొటేషన్’
మరోసారి అవకాశం లేకుండా మార్పు
బీసీ మహిళ నుంచి జనరల్‌కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
అప్పుడే మొదలైన ఊహాగానాలు.. జూన్‌లోనే జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు
12 మున్సిపాలిటీల్లో ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు
మున్సిపాలిటీల రిజర్వేషన్ల వివరాలు


