రోడ్డుపై రోడ్డు.. ఎవరు అడ్డు?
నిధుల కాజేతకే రహదారుల నిర్మాణం!
వరంగల్ అర్బన్: ఇలా.. నర్సంపేట, ఎల్‌బీ నగర్ రోడ్డు కాదు. 66 డివిజన్లలోని అంతర్గత, ప్రధాన రహదారి కాదు.. డ్రెయినేజీ పైపులు, తాగునీటి పైప్‌లైన్లు, ప్రైవేట్ కేబుల్స్ ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా తవ్వుతూ అధ్వానంగా మారుస్తున్నారు. రోడ్లు బాగున్నప్పటికీ వాటిపైనే మళ్లీ రోడ్లు వేస్తూ నిధులు మెక్కేస్తున్నారు. కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు రోడ్ల నిర్మాణం సంపాదనా మార్గంగా మారింది. బాగున్న రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేయడం, ప్రజాధనం దుర్వినియోగం చేయడం బల్దియా ఇంజనీర్లకు పరిపాటిగా మారింది. ఏటా కొత్త రోడ్ల నిర్మాణాల కోసం బల్దియా సుమారు రూ.120 కోట్లు వెచ్చిస్తోంది. నిర్మాణం పూర్తి చేసి రెండేళ్లు కూడా అవకముందే, మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్ నిర్వహణ బాధ్యతలు పూర్తవకుండానే మళ్లీ రోడ్లు నిర్మిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనాలోచిత అనుమతులు..
గుంతల్లో ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ప్రధాన రహదారులపై తారు పోస్తున్నారు. మట్టితో పూడ్చిన రోడ్లు కొద్ది రోజులకే కుంగిపోయి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సమస్యలు లేకపోయినా బల్దియా ఇంజనీర్లు నిర్మాణానికి లైన్ క్లియర్ చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకన్నా అధ్వానంగా ఉన్న రహదారులు నగరంలో చాలా ఉన్నాయి. ప్రజాధనాన్ని అలాంటి వాటి కోసం ఖర్చు చేస్తే జనానికి ఉపయోగం. కానీ, క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆర్‌అండ్‌బీ రోడ్డు దెబ్బతింటే కొత్తగా లేయర్ వేయాలి. ప్యాచ్ వర్క్‌లు చేస్తే సరిపోతుంది. కానీ, బల్దియా, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు అనాలోచితంగా కమీషన్ల కోసం కొత్త రోడ్లకు అనుమతులిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కనిపించని ప్యాచ్ వర్క్ పనులు
తాగునీటి పైపులైన్లు, వాల్వులు లీకేజీలు అరికట్టడం, డ్రెయినేజీ స్తంభిస్తే మళ్లీ చర్యలు చేపడుతున్నారు. సీసీ, బీటీ రోడ్లపై ప్యాచ్ వర్క్‌లు పనులు చేయడం లేదు. డివిజన్ల వారీగా పైపులైన్ల మరమ్మతులు పూర్తయిన తర్వాత కాంక్రీట్, బీటీతో మరమ్మతులు చేస్తే రోడ్లు దెబ్బతిన్నప్పుడు ఆయా ప్రాంతాల వాసులకు సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ, అలా చేయడం లేదు. ఐదారు ఏళ్లకు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత కొత్తగా రోడ్డు వేస్తున్నారు. అప్పటి వరకు వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రత్యేక నిధి అవసరం..
చిన్న సీసీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం లీకేజీలకు మరమ్మతులు చేసిన ఆయా ఏఈలకు నయాపైసా రాకపోవడంతో, జేబుల్లోంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేస్తూ నానా అవస్థలు పడుతున్నారు. పండుగల సమయంలో గుంతలు పూడ్చేందుకు టెండర్లు పెడుతుండగా, ఆ పనులు అరకొరగా ఉంటుండడంతో ఎక్కడ ఏం పనులు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటికై నా ఉన్నతధికారులు పరిశీలించి మూడు నెలలకోసారైనా లీకేజీల కోసం తవ్విన రోడ్లకు తిరిగి మరమ్మతులు చేసేలా కార్చాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. నిధుల దుర్వినియోగంపై ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరితే అదో మామూలు విషయమని కొట్టిపారేస్తుండడం గమనార్హం.
సీసీ, బీటీ రోడ్లకు ప్యాచ్ వర్క్‌లు కరువు
నగర ప్రజలు చెల్లించే
సొమ్ము దుర్వినియోగం
కమీషన్ల కోసం ఇంజనీర్లు,
ప్రజాప్రతినిధుల కక్కుర్తి
వరంగల్ ఎల్‌బీనగర్‌లో కొద్ది రోజుల క్రితం స్థానికు లకు నల్లా నీళ్లు సరిగ్గా రావడం లేదని సీసీ రోడ్డు మధ్యలో తవ్వకాలు చేపట్టి కొత్తగా పైపులైన్ వేశారు. తవ్విన మట్టిని పోసి వదిలేశారు. రోడ్డంతా గతుకులమయంగా మారింది.
వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్‌కు సమీపంలోని నర్సంపేట రహదారిలో బీటీ రోడ్డును బల్దియా ఇంజనీర్లు పరిశీలించి, నూతన పైపులైన్ నిర్మాణానికి జేసీబీతో పెద్ద గుంత తీసి పైప్ లైన్ వేశారు. కానీ, బీటీ ప్యాచ్ వర్క్ చేయలేదు. ఆర్‌అండ్‌బీ రోడ్డు కావడంతో నిర్లక్ష్యంగా వదిలేశారు. రోడ్డు దెబ్బతిని పూడ్చిన మట్టితో కుంగిపోయింది. వాహనదారులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుపై రోడ్డు.. ఎవరు అడ్డు?
రోడ్డుపై రోడ్డు.. ఎవరు అడ్డు?


