ఆకాశవాణి క్వార్టర్స్‌లోనే వెల్‌నెస్ సెంటర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో కొనసాగుతున్న వరంగల్ ఆకాశవాణి క్వార్టర్స్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీచేసినట్లు వరంగల్ ఎంపీ కడియం కావ్య శుక్రవారం వెల్లడించారు. వరంగల్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు కోసం సంవత్సరంన్నర నుంచి ఎంపీ కడియం కావ్య ప్రయత్నిస్తున్నారు. తొలుత వరంగల్ జిల్లాలో వెల్‌నెస్ సెంటర్ కోసం నాలుగు అనువైన ప్రభుత్వ కార్యాలయాలను అధికారులతో కలిసి పరిశీలించారు. వాటిలో కాకతీయ యూనివర్సిటీలోని వరంగల్ ఆకాశవాణి సిబ్బంది క్వార్టర్‌లో కొత్తగా వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు అయ్యాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి.
కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తా..
దేశవ్యాప్తంగా సుమారు 22 వెల్‌నెస్ సెంటర్లు మంజూరయ్యాయి. వరంగల్ జిల్లాలో ఒక వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఎంపీ నిధులతో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తా. వరంగల్ పరిధిలో ఉన్న 15 వేల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలకు వైద్య సేవలందుతాయి. వెల్‌నెస్ సెంటర్ పనులు ప్రారంభించాలని సీజీహెచ్‌ఎస్ డైరెక్టర్ రోహిణిని కోరాను. త్వరలోనే ఆమె పనులు ప్రారంభిస్తారు. – కడియం కావ్య, ఎంపీ, వరంగల్
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
ఉత్తర్వులు జారీ
ఫలించిన ఎంపీ కడియం కావ్య కృషి


