ముందు ‘మున్సిపల్’.. తర్వాత గ్రేటర్!
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపాలిటీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌కు రెండు రోజుల ఆలస్యంగానైనా వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా ప్రకటన వెలువడింది. ఆ తర్వాత వెంటనే మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలకశాఖ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు మేయర్, చైర్మన్ స్థానాల్లో 3 కార్పొరేషన్లు, 38 మున్సిపాలిటీలను బీసీలకు కేటాయించారు. అయితే ఏ జిల్లాలో ఏ నగరం, ఏ పట్టణం ఎవరికి కేటాయిస్తారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఇందులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు 12 మున్సిపాలిటీలపై శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి అందరూ ఊహించినట్లుగా ‘పుర’పోరుకు వేగంగా పావులు కదులుతుండగా.. రెండు, మూడు రోజుల్లో (20వ తేదీ వరకు) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చని అంటున్నారు. ఈ విషయమై అధికారులు, అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
త్వరలోనే రిజర్వేషన్లు.. నోటిఫికేషన్
ముందుగా ప్రకటించిన ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం, జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆదివారం, సోమవారం.. రెండు రోజులు మేడారంలో బస చేయనున్న ఆ యన సమ్మక్క సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రారంభించడం, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంతకు ముందే నిర్వహించే కేబినెట్ సమావేశంలో ఎన్నికల అంశం ప్రధానం కానుండగా.. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారానికి తోడు రెండు రోజుల కిందట మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ప్రకటన కూడా ఊతం ఇస్తోంది. దీంతో మున్సిపల్ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లలో ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీల్లో ఏ మున్సిపాలిటీ ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుందోనన్న చర్చ కూడా సీరియస్‌గా సాగుతోంది. వార్డుల ఆధారంగా కూడా రిజర్వేషన్ల అంశం రెండు రోజుల్లో తేలే అవకాశం ఉందన్న ప్రచారం ఆశావహులను ఉత్కంఠకు గుర్తి చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు సైతం మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మున్సిపల్ వార్డులు, చైర్మన్ల కోసం అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి.
గ్రేటర్‌లో డివిజన్ల విస్తరణ లేనట్లే!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ డివిజన్ల విస్తరణ ఉంటుందని భావించారు. ప్రజాప్రతినిధులు కూడా కొందరు ప్రయత్నాలు చేశారు. గ్రేటర్ పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది మే 7న ముగియనుంది. ఈలోగా పెరిగి న జనాభా, ఇళ్ల నిర్మాణానికి తోడు విస్తరించిన నగరాన్ని దృష్టిలో పెట్టుకుని 66 డివిజన్లను 88 డివిజన్లకు పెంచాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. 2011 జనాభా లెక్కలకు ప్రస్తుత జనాభాతో పోలిస్తే భారీగానే పెరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 406 చదరపు కిలోమీటర్ల మేరకు నగరం విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఒక్కో డివిజన్‌కు 7 వేల నుంచి 9 వేల ఓటర్లను తీసుకుని 88 డివిజన్లు చేయాలని పురపాలక శాఖ డైరక్టర్ టీకే శ్రీదేవికి పలుమార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఈ తరుణంలోనే వార్డుల రిజర్వేషన్లపై ప్రకటన వెలువడటంతో ఇప్పట్లో డివిజన్ల విస్తరణ లేనట్లేనన్న చర్చ మొదలైంది. దీంతో పాటు ఈ సారి ‘గ్రేటర్’మున్సిపల్ కార్పొరేషన్‌ను మళ్లీ మహిళలకే కేటాయిస్తారా? ఏమైనా మార్పులు చేస్తారా? అన్న చర్చ కూడా జరుగుతోంది.
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్?
‘గ్రేటర్’ సహా 12 మున్సిపాలిటీల్లో
వార్డులు ఖరారు
మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లపై
నేడు ప్రకటన
మేడారంలో రేపు ఉమ్మడి జిల్లా
కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీ
మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు – 2026
జిల్లా మున్సిపాలిటీ వార్డులు ఎస్టీ ఎస్సీ బీసీ మహిళ(జ) అన్
రిజర్వుడు
హనుమకొండ జీడబ్ల్యూఎంసీ 66 2 11 20 17 16
పరకాల 22 1 5 5 7 4
వరంగల్ నర్సంపేట 30 3 4 8 8 7
వర్ధన్నపేట 12 3 2 1 4 2
జనగామ జనగామ 30 1 5 9 9 6
స్టేషన్‌ఘన్‌పూర్ 18 1 5 3 6 3
మహబూబాబాద్ మహబూబాబాద్ 36 7 5 6 10 8
డోర్నకల్ 15 4 3 0 4 4
మరిపెడ 15 6 1 0 4 4
తొర్రూరు 16 2 3 3 5 3
కేసముద్రం 16 3 2 3 5 3
భూపాలపల్లి భూపాలపల్లి 30 2 6 7 8 7
ములుగు ములుగు 20 2 3 5 6 4


