వరద నష్టంపై కేంద్రానికి నివేదిక
హన్మకొండ/న్యూశాయంపేట/వరంగల్ అర్బన్/ హన్మకొండ కల్చరల్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మొంథా తుపానుతో పంటలు, ఆస్తి, చెరువులు, కాల్వలకు వాటిల్లిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ గయా ప్రసాద్ తెలిపారు. శుక్రవారం 8 మందితో కూడిన రెండు కేంద్ర బృందాలు హనుమకొండ, వరంగల్ జిల్లాలో క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాయి. అనంతరం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించింది. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నష్టంపై సర్వే పూర్తి చేశామని, 41 కాలనీల్లో బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ప్రతీ బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.15 వేల చొప్పున రూ.5,23,095 బాధిత కుటుంబాలకు అందించామన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో 378.318 మిల్లిమీటర్ల వర్షం కురిసిందని, ఖిలా వరంగల్, వరంగల్ మండలాల్లో 368.271 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు.
అమ్మవారి సేవలో..
భద్రకాళి దేవాలయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ గయా ప్రసాద్, కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ పొన్నుస్వామి, బైరి శ్రీనివాస్, ఎస్‌ఎస్ పింటో, వనీత, నిశాంత్ మిశ్రా, రాహుల్, శశివర్ధన్ తదితరులు సందర్శించి పూజలు చేశారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తల తొనుపునూరి వీరన్న, అర్చకులు వారిని పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం భూపాలపల్లి ఏసీపీ సంపత్‌రావు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
జాయింట్ సెక్రటరీ గయాప్రసాద్
జిల్లాల్లో కేంద్ర బృందం
విస్తృత పర్యటన


