ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి
హన్మకొండ అర్బన్ : జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రవితో కలిసి మండలాలు, గ్రేటర్ వరంగల్, పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. తుది దశకు చేరుకున్న ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు, ఎస్‌బీఎం, వీబీ–జీ రామ్‌జీ (ఉపాధి హామీ) పథకం పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రతి వారం కనీసం 30 శాతం పనుల పురోగతి ఉండాలని ఆదేశించారు. ఎల్–3 జాబితాలో అర్హులైన లబ్ధిదారులు ఉన్నట్లయితే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే మంజూరై కూడా పనులు ప్రారంభం కాని ఇళ్లను ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా మొదలు పెట్టాలని, ఇకపై గడువు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. పనులు ప్రారంభించని పక్షంలో వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థనాయక్, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, బిల్లుల వివరాలను, డీఆర్డీఏ మేన శ్రీను ఎస్‌బీఎం, వీబీ–జీ రామ్‌జీ పనుల పురోగతిని కలెక్టర్‌కు తెలియజేశారు. గృహ నిర్మాణ శాఖ డీఈ రవీందర్, కాజీపేట డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఉన్నారు.
‘కుడా’ అభివృద్ధి పనులపై సమీక్ష
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా వేయిస్తంభాల ఆలయ పరిసరాల్లోని పనులు, భద్రకాళి ఆలయ మాడ వీధుల అభివృద్ధి పనుల స్థితిగతులను కలెక్టర్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్


