ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం
డీఐపీసీ సమావేశంలో
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: తెలంగాణ ఐపాస్ పోర్టల్ ద్వారా జిల్లాలోని 40 వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన 74 అనుమతుల దరఖాస్తులపై కమిటీ సభ్యులతో కలిసి విస్తృతంగా చర్చించామని, జిల్లాలో ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ(డీఐపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గత సమావేశం నుంచి ఇప్పటి వరకు టీజీ ఐపాస్ ద్వారా 40 పరిశ్రమలకు సంబంధించిన దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఇప్పటివరకు 48 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, వాటి ద్వారా సుమారు రూ.380.53 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుమారు 6,810 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహమూర్తి, డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జ్యోతి, ఎల్‌డీఎం ఎల్.రాజు, జిల్లా రవాణా శాఖాధికారి శోభన్‌బాబు, డీటీఓ విజయసాగర్, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేశ్‌తోపాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


