రిపబ్లిక్ డేకు ఏర్పాట్లు చేయాలి
హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్ : గణతంత్ర వేడుకలకు ఆయా శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ నెమురుగొమ్ముల రవి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో రిపబ్లిక్ డే ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రవి మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలిసేలా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాల ఎంపికలో సేవా ప్రమాణాలు, సాధించిన ప్రగతిని ప్రామాణికంగా తీసుకోవాలని అన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై ప్రసంగ పాఠం సిద్ధం చేసేందుకు సంబంధిత శాఖలు వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్ శాఖ, హనుమకొండ పరేడ్ గ్రౌండ్స్, కలెక్టరేట్ వద్ద వేదిక అలంకరణ, మార్చ్ ఫాస్ట్, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, సీటింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఆర్‌అండ్‌బీ శాఖ బారికేడింగ్, విద్యాశాఖ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు ఏర్పాటు చేయాలని, మున్సిపల్ శాఖ విద్యుదీకరణ, తాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, డీఆర్‌డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్‌తో పాటు విద్య, వైద్య, విద్యుత్, పోలీస్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


