సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం
● జంపన్నవాగు పుష్కరఘాట్ పనుల పరిశీలన
ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఖమ్మం నుంచి హెలికాప్టర్‌లో మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధికి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రులు, అధికారులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మంత్రులు ధనసరి సీతక్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతోపాటు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, డాక్టర్ మురళి నాయక్, యశస్విని రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్టేట్ ఫైనాన్స్, ఆయిల్ ఫెడ్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జంగా రాఘవరెడ్డి, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడినుంచి నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి జాతర ప్రాంతాల దృశ్యాలను తిలకించారు. ఏఐ అత్యాధునిక కెమెరాలు, ఏఎన్‌పీఆర్ కెమెరాల పనితీరును పోలీసు అధికారులు వివరించారు. అంతకుముందు కమాండ్ కంట్రోల్ వద్ద సీఎంకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
పనుల పరిశీలన
జంపన్నవాగు వద్దకు వెళ్లిన సీఎం, మంత్రులు భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్నానఘట్టాలు, బాత్‌రూమ్‌లు, షవర్లను పరిశీలించారు. అనంతరం కాలినడకన హరిత హోటల్ సమీపంలోని సర్కిల్, ఊరట్టం స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేపింగ్‌లో సుందరంగా తీర్చిదిద్దిన కళాచిత్రాలను పరిశీలించారు.


