
నిర్మానుష్య ప్రదేశాలపై నిఘా పెట్టండి
● మత్తు పదార్థాల రహిత
సమాజమే లక్ష్యం : సీపీ సన్‌ప్రీత్ సింగ్
కేయూ క్యాంపస్: ‘మత్తు పదార్థాల నియంత్రణకు విద్యాసంస్థల పరిసరాలతో పాటు నిర్మానుష్య ప్రదేశాలపై నిఘా పెట్టండి’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ పోలీస్ అధికారులతో అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం సెనేట్ హాల్‌లో గురువారం పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్షలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాల నిరోధానికి పోలీస్ అధికారులు పోలీస్టేషన్ పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణకు వివిధ చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా మద్యం దుకాణాల యజమానుల్ని ఆదేశించాలన్నారు. పోలీసు సిబ్బంది యోగక్షేమాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. కాగా, సన్‌ప్రీత్‌సింగ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీస్ అధికారులతో పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్షించారు. కేసుల పరిష్కారానికి పలు సూచనలిచ్చారు. సమావేశంలో డీసీపీలు షేక్‌సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, వరంగల్, జనగామ ఎస్పీలు శుభం, చేతన్ నితిన్, అదనపు డీసీపీలు ప్రభాకర్, రవి ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.