
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు
● మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: వాతావరణ శాఖ సూచనల మేరకు రాష్ట్రంలో అల్పపీడనం వల్ల కురిసే భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వలపై సీఎస్ రామకృష్ణారావుతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసు యంత్రాంగం సహకారాన్ని పూర్తిస్థాయిలో తీసుకోవాలన్నారు. సమావేశంలో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, అధికారులు, వరంగల్‌నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గౌతంరెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ రవి, జిల్లా అఽధికారులు పాల్గొన్నారు.
మరమ్మతులపై అవగాహన అవసరం
రామన్నపేట: వాహన మరమ్మతులపై డ్రైవర్లకు ప్రాథమిక అవగాహన అవసరం ఉందని, మేయర్ గుండు సుధారాణి సూచించారు, గురువారం బల్ది యా కార్యాలయంలో టాటా వాహన కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో వాహనాలకు కనీస మరమ్మతులపై చెత్తతరలింపు వాహన డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా సుధారాణి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సీఎంహెచ్ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, సీఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈ మాధవీలత, డీఈ రాజ్‌కుమార్, భాస్కర్, నరేందర్, శ్రీను, ఏఈలు పాల్గొన్నారు.
అండర్– 15, 17 ఫుట్‌బాల్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: సుభ్రతో ముఖర్జీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 16న అండర్–15, 17 బాలుర విభాగాల్లో జిల్లా స్థాయి ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌కుమార్ తెలిపారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని సెయింట్ గాబ్రిఝెల్ స్కూల్ మైదానంలో నిర్వహించే ఎంపికల్లో హాజరయ్యే క్రీడాకారులు జనవరి 01, 2011, జనవరి 01, 2009ల తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా రిజిష్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన జట్లు ఈనెల 20, 21 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
త్రికూటాలయాల నిర్మాణాలు అద్భుతం
● కాకతీయ వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్
విద్యారణ్యపురి : కాకతీయుల త్రికూటాలయాల నిర్మాణాలు అద్భుత శిల్పకళావైభవానికి నిదర్శనమని కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులుగా ‘కాకతీయ టెంపుల్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ గురువారం ముగిసింది. ఈ ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయుల త్రికూటాలయాలు శివకేశవుడు, సూర్యదేవ ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయన్నారు. బడంగ్‌పేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ కాకతీయుల దేవాలయాల శిల్పకళ ప్రసిద్ధిగాంచిందన్నారు. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. విజయలక్ష్మి మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళలకు నిలయం రామప్పదేవాలయం అన్నారు. అనంతరం హనుమకొండ ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి వర్ధన్నపేట, కేడీసీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పోచయ్య, జి. శ్రీనివాస్, టీహెచ్‌సీ ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఎం. వీరేందర్, హెరిటేజ్ యాక్టివిస్ట్ ఆర్య, ఈవర్క్‌షాప్ కన్వీనర్ కొలిపాక శ్రీనివాస్, వైస్‌ప్రిన్సిపాల్ జి. సుహాసిని, అకడమిక్ కోఆర్డినేటర్ ఎం. అరుణ, ఐక్యూఏసీకోఆర్డినేటర్ సురేశ్‌బాబు మాట్లాడారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, చరిత్రకారులకు అతిథుల చేతులమీదుగా సరిఫికెట్లు అందజేశారు.
నాందేడ్–తిరుపతి వీక్లీ రైళ్ల సర్వీస్‌ల పొడిగింపు
కాజీపేట రూరల్ : వరంగల్ మీదుగా కొనసాగుతున్న నాందేడ్–తిరుపతి–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను పొడిగించి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
రైళ్ల వివరాలు..
2026, మార్చి 28వ తేదీ వరకు హెచ్.ఎస్.నాందేడ్–తిరుపతి (07015) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ ఆదివారం వరంగల్‌కు చేరుతుంది. అదేవిధంగా 2026, మార్చి 29వ తేదీ తిరుపతి–హెచ్.ఎస్.నాందేడ్ (07016) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ సోమవారం వరంగల్‌కు చేరుతుంది. 1– ఏసీ, 2– ఏసీ, 3– ఏిసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌లకు ముద్కెడ్, బాసర, నిజామాబాద్, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మఽధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో అప్ అండ్ డౌన్ హాల్టింగ్ కల్పించారు.