
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకరయ్యపై ఫిర్యాదు
● ఐదుగురితోకూడిన కమిటీ నియామకం
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న శంకరయ్యపై ఇటీవల వీసీ ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో వీసీ అప్రూవల్ మేరకు కమిటీని నియమిస్తూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం రెండు రోజులక్రితం ఉత్తర్వులు జారీచేశారు.ఈ కమిటీ చైర్మన్‌గా సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు, మెంబర్లుగా సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, ఫిజిక్స్‌విభాగం ప్రొఫెసర్ శ్రీలత, జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, మెంబర్ కన్వీనర్‌గా డిప్యూటీ రిజిస్ట్రార్ పి. శ్రీధర్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. తెలుగు విభాగంలో శంకరయ్య 2011–2013లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చే పోస్టు డాక్టరల్ ఫెల్లోషిప్( పీడీఎఫ్) పొందారు. ఫెల్లోషిప్‌తోపాటు కాంటిజెన్స్ కూడా డ్రా చేశారని, మరోవైపు పార్ట్‌టైం లెక్చరర్‌గా కూడా విధులు నిర్వర్తిస్తూ కేయూ నుంచి రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారనే ప్రధాన ఆరోపణ ఉంది. యూజీసీ నిబంధనల ప్రకారం పీడీఎఫ్ పొందుతున్నప్పుడు పార్ట్‌టైం లెక్చరర్‌గా విధులు నిర్వర్తించొద్దు. శంకరయ్య నిబంధనలకు విరుద్ధంగా పీడీఎఫ్ లబ్ది పొందుతూనే పార్ట్‌టైం లెక్చరర్‌గా కూడా రెమ్యునరేషన్ తీసుకున్నారనే ఆరోపణలతో పలు అసోసియేషన్స్, విద్యార్థుల ఫిర్యాదు, వినతుల నేపథ్యంలో ఈ కమిటీని నియమిస్తున్నామని రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ జరిపి పదిరోజుల్లో నివేదిక సమర్పించాలని, దీని ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఎరువుల కొరత లేకుండా చూడాలి
ధర్మసాగర్: రైతులకు ఎరువుల కొరత రాకుండా చూసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) ఎరువుల గోదాంను గురువారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో రైతులకు ఎరువులు, లిక్విడ్ రూపంలో లభించే నానో డీఏపీ, నానో యూరియా అవసరమైనంత మేర అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పీఏసీఎస్ చైర్మన్‌కు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, వేలేరు మండలాల రైతులకు సరిపడా ఎరువులను.. గోదాం నిర్వాహకులు అడిగిన వెంటనే పంపించాలని ఆదేశించారు. ఎరువుల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.