
నేటితో ముగింపు
మరోసారి అవకాశం
లభిస్తుందని పాలకవర్గాల ఆశ..
గత ప్రభుత్వం పీఏసీఎస్‌ల కాలపరిమితి ముగిసినా వాటినే పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగించింది. సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించలేక పోతే ఆరు నెలల పాటు పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించొచ్చు. ఈ మేరకు ప్రస్తుత పాలకవర్గానికి ముందు ఉన్న కమిటీలను ఆరు మాసాల చొప్పును నాలుగు పర్యాయాలు పొడిగింపు ఇచ్చారు. దీంతో వారు అదనంగా రెండు సంవత్సరాల పాటు పదవుల్లో కొనసాగారు. ఈసారి కూడా గతంలో మాదిరి పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా పొడిగింపు ఇచ్చారు. పొడిగింపు కాలపరిమితి ముగియనుండడంతో గతంలో మాదిరిగానే మరోసారి అవకాశం దక్కుతుందనే ఆశలో ప్రస్తుత పాలక వర్గాలున్నాయి. డీసీసీబీలకు కూడా ప్రస్తుత పాలకవర్గాలకు పొడిగింపు ఇచ్చారు. ఓడీసీఎంఎస్‌కు మాత్రం ప్రభుత్వం వరంగల్ అదనపు జిల్లా కలెక్టర్‌ను పర్సన్ ఇన్‌చార్జ్‌గా నియమించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరగగా చాలా వరకు బీఆర్‌ఎస్ నాయకులు, అభిమానులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా మంది పీఏసీఎస్ చైర్మన్లు, మెజారిటీ డీసీసీబీ చైర్మన్లు అధికార కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అంతా అధికార పార్టీకి చెందిన వారు కావడంతో మరోసారి తమకు పర్సన్ ఇన్‌చార్జ్ చైర్ పర్సన్లుగా పొడిగింపు లభిస్తుందని ఆశిస్తున్నారు.
పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్ల కొనసాగింపేనా?
హన్మకొండ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల గడువు ముగుస్తోంది. దీంతో పాలకవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తమను పర్సన్ ఇన్‌చార్జ్ చైర్ పర్సన్లుగా, కమిటీలుగా కొనసాగిస్తారా? లేక పదవీ కాలపరిమితి ముగియడంతో వైదొలగాల్సి వస్తోందా అనే మీమాంసంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుత పాలకవర్గం ఎన్నిక ముందు గత పాలక వర్గాన్ని పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగించారు. ఈసారి కూడా ప్రస్తుత పాలక వర్గాలకు ఆరు నెలల పొడిగింపు ఇచ్చారు. పొడిగింపు కాలపరిమితి నేటి(గురువారం)తో ముగుస్తుంది. దీంతో మరోసారి తమకే అవకాశం దక్కుతుందనే ఆశల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పర్సన్ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్లు ఉన్నారు.
సహకార శాఖలో కనిపించని ఎన్నికల
సన్నాహాలు..
ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. అయితే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకవర్గం కాల పరిమితి ముగిసి ఒకసారి పొడిగింపు అవకాశమిచ్చి ఆ కాలపరిమితి కూడా ముగుస్తున్నా ఆ శాఖలో ఎన్నికల సన్నాహాలు కనిపించడం లేదు. దీంతో ఇప్పట్లో సహకార ఎన్నికలు జరిపే అవకాశం కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రస్తుత పాలక వర్గాలు తమకు పొడిగింపు లభించొచ్చని ఆశిస్తున్నాయి.
2020, ఫిబ్రవరి 15న పీఏసీఎస్‌లకు
ఎన్నికలు..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరి 15న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాలు కావడంతో వీటి కాలపరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగిసింది. అదే విధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), ఓరుగల్లు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఓడీసీఎంఎస్)ల కాల పరిమితి ఈ ఏడాది ఫిబ్రవరి 29తో ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 99 పీఏసీఎస్‌లు ఉండగా వరంగల్ డీసీసీబీ పరిధిలో 91 సంఘాలున్నాయి. వరంగల్ డీసీసీబీ పూర్వ వరంగల్ జిల్లా పరిధి మేరకు విస్తరించి ఉంది. వరంగల్ డీసీసీబీ పరిధిలో హనుమకొండ జిల్లాలో 14 పీఏసీఎస్‌లు, భూపాలపల్లి జిల్లాలో 6, జనగామలో 14, మహబూబాబాద్‌లో 16, ములుగులో 11, సిద్దిపేటలో 2, వరంగల్ జిల్లాలో 28 పీఏసీఎస్‌లున్నాయి. అయితే నూతనంగా ఏర్పాటైన జిల్లాల వారీగా చూస్తే.. హనుమకొండ జిల్లాలో 16, వరంగల్‌లో 28, జనగామలో 14, మహబూబాబాద్‌లో 19, ములుగులో 12, జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి.
2025, ఫిబ్రవరి 12తో కాలపరిమితి ముగియగా ఆరు నెలలు పొడిగింపు
నేటితో పూర్తి కానున్న
పొడిగింపు పాలకవర్గాల కాలపరిమితి
అయినా సహకార శాఖలో కనిపించని ఎన్నికల హడావుడి
ఆరు నెలల వరకు ప్రస్తుత
పాలకవర్గాన్ని పొడిగించే అవకాశం